National

లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త టెలికాం నిబంధనలు.. అలాంటి వారికి ఇక చుక్కలే!

Published

on

త్వరలో టెలికాం విభాగంలో కొత్త నిబంధనలు రానున్నాయి. గతేడాది ఆమోదించిన టెలికమ్యూనికేషన్స్‌ చట్టం 2023లోని తాజా నిబంధనలను డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (DoT) అమలు చేయనుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గతంలో డాట్‌కు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 100 రోజుల తర్వాత ఇవి అమలవుతాయని తెలుస్తోంది.

నకిలీ సిమ్‌ కార్డ్‌లు, సైబర్‌ మోసాలను నిరోధించడానికి కొత్త నిబంధనలు ఉపయోగపడనున్నాయి. టెలికాం చట్టం 2023 ప్రకారం.. కొత్త కనెక్షన్‌ కోసం బయోమెట్రిక్‌ గుర్తింపు తప్పనిసరి. వ్యక్తిగత డేటా దుర్వినియోగాన్ని అడ్డుకోడానికి టెలికాం కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు వినియోగదారుల సున్నితమైన ఈ డేటాను సేకరించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను డాట్‌ జారీ చేయనుంది. అంతేకాదు, స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌కు సంబంధించిన మార్పులు చోటుచేసుకోనున్నాయి. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలంటే.. సదరు సంస్థలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సిఉంటుంది.

కొత్త టెలికాం చట్టంలోని 35-37 కొత్త నిబంధనలు అభివృద్ధి చెందుతున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఉన్నాయి. ఈ చట్టంలోని వివిధ సెక్షన్లలో పొందుపరిచిన నిబంధనలను వచ్చే సెప్టెంబర్ 15 నాటికి అమల్లోకి తీసుకురావాలని డాట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. టెలికాం రంగంలో మార్గదర్శకాలు, నిబంధనలకు సంబంధించి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం (1885), ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ చట్టం (9133), టెలిగ్రాఫ్‌ వైర్స్‌ చట్టం (1950) స్థానంలో కేంద్రంకొత్త చట్టం తీసుకొచ్చింది. గతేడాది డిసెంబరు 20న టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు 2023 (Telecom Act 2023)ను పార్లమెంట్ ఆమోదించింది.

సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు దాదాపు 1.8 మిలియన్ల మొబైల్ నంబర్‌లను బ్లాక్ చేయనున్నారు.సైబర్ క్రైమ్ కోసం ఉపయోగిస్తున్న 28,000 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను డిస్‌కనెక్ట్ చేయాలని డాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లలో ఉపయోగించిన అనేక నంబర్‌లను బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version