National
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక.. ప్రధాని మోదీ, రాహుల్ అభినందనలు
Lok Sabha Speaker Om Birla : లోక్‌సభ స్పీకర్ గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్ సభ సమావేశాలు మూడోరోజు బుధవారం ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఎన్నిక ప్రారంభమైంది. స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం పెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్ నాథ్ సింగ్ తో పలువురు ఎన్డీయే ఎంపీలు బలపర్చారు. ఇండియా కూటమి తరపున కె. సురేష్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. అతని తీర్మానాన్ని పలువురు ఇండియా కూటమి ఎంపీలు బలపర్చారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. మూజువాణి ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో స్పీకర్ గా ఓంబిర్లా విజేతగా నిలిచారు. ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాజ్ ప్రకటించారు.
ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికైన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లా వద్దకు వెళ్లి అభినందించారు. ఆ తరువాత మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరు బిర్లాను స్పీకర్ చైర్ వద్దకు తోడ్కొని వెళ్లారు. అనంతరం మోదీ ఓం బిర్లాను స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టారు. ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నిక కావటం ఇది రెండోసారి. స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు. 61ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్ లోని కోటా నుంచి మూడోసారి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తరువాత.. 17వ లోక్ సభకు స్పీకర్ గా ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఓటింగ్ ద్వారా ఆయన స్పీకర్ గా ఎన్నికయ్యారు.