Latest
Life On Another Planet: సుదూర గ్రహంపై జీవం ఉనికి.. కీలక ఆధారం గుర్తించిన జేమ్స్ టెలిస్కోప్
విశ్వంలో మన భూమిని పోలిన గ్రహాన్ని, జీవం ఉనికిపై శాస్త్రవేత్తల అన్వేషణ ఈనాటిది కాదు.. సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకూ మరే ఇతర గ్రహంపైనా జీవం ఉన్నట్లు కచ్చితమైన ఆధారాలు దొరకలేదు. ప్రాణికోటికి అవసరమయ్యే పరిస్థితులు, భూమిని పోలిన పలు గ్రహాలను నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) గుర్తించింది. తాజాగా సుదూర నక్షత్ర మండలంలోని ఓ గ్రహంపై జీవం ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలు లభించాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. విశ్వంలో ప్రయోగాల కోసం పంపించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్ టీ) ఈ గ్రహాన్ని గుర్తించిందని తెలిపింది. ఈ రెడ్ డ్వార్ఫ్ స్టార్ కు నాసా శాస్త్రవేత్తల బృందం కే2-18బి గా నామకరణం చేసింది.
అయితే, ఈ సమాచారాన్ని మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన డాక్టర్ నిక్కు మధుసూధన్ చెప్పారు. ఇప్పుడే తొందరపడి ఓ అంచనాకు రాలేమని వివరించారు.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏం గుర్తించిందంటే..
కే2-18బి నక్షత్రంపై డైమిథైల్ సల్ఫైడ్ (డీఎంఎస్) వాయువు ఆనవాళ్లను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ వాయువు (గ్యాస్) కేవలం ప్రాణికోటి వల్ల మాత్రమే ఉత్పత్తి అవుతుందని వివరించారు. నిర్జీవ గ్రహాలపై ఈ గ్యాస్ ఉండే అవకాశం లేదన్నారు. వాతావరణంలో మరేరకంగానూ డైమిథైల్ సల్ఫైడ్ ఉత్పత్తయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. కే2-18బి నక్షత్రంపై ఈ గ్యాస్ ఉందని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించడంతో అక్కడ జీవం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టెలిస్కోప్ అందించిన వివరాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఎంత దూరంలో ఉందంటే..
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిన ఈ నక్షత్రం మన భూమి నుంచి చాలా దూరంలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 124 కాంతి సంవత్సరాల దూరంలో కే2-18బి ఉందని పేర్కొన్నారు. వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ వేగం (గంటకు 38 వేల మైళ్ల స్పీడ్) తో వెళితే ఈ నక్షత్రాన్ని చేరుకోవడానికి సుమారు 22 లక్షల సంవత్సరాలు పడుతుందన్నారు.