International

కొండచరియలు విరిగిపడి 2వేల మంది సజీవ సమాధి- ప్రపంచ దేశాలు ఆదుకోవాలని వినతి – Papua New Guinea Land Slide

Published

on

Papua New Guinea Land Slide Death Toll : పపువా న్యూ గినియాలో ఊహకందని విధంగా ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. భారీ కొండచరియలు విరిగిపడి ఏకంగా 2వేలమందికి పైగా సజీవ సమాధి అయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ మేరకు ఆ దేశం ఐక్యరాజ్య సమితికి వివరాలు అందించినట్లు సమాచారం.

ఎన్గా ప్రావిన్సులో కొండచరియలు విరిగిపడి 2వేల మందికి పైగా సజీవ సమాధి అయ్యారని, ఘటనా స్థలంలో భారీ విధ్వంసం జరిగిందని రాజధాని పోర్ట్‌ మొరస్బీలో ఉన్న ఐరాస కార్యాలయానికి పపువా న్యూ గినియా జాతీయ విపత్తు కేంద్రం సమాచారం అందించింది. భవనాలు, ఆహార తోటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఆర్థికంగా తమపై పెనుప్రభావం చూపిందని పేర్కొంది. పోర్గెరా మైన్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయిందని సమాచారం. వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు ఇప్పటికే అక్కడ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ ఫర్‌ మైగ్రేషన్‌ మిషన్‌ తెలిపింది. కొండచరియలు మెల్లమెల్లగా జారుతూ ఉండటం వల్ల రెస్క్యూ టీమ్‌లకు కూడా ప్రమాదకరంగా మారిందని వివరించింది.

సహాయక చర్యలకు సిద్ధమైన ఆస్ట్రేలియా
వీలైనంత త్వరగా తాజా పరిస్థితి గురించి ఇతర దేశాలకు తెలియజేయాలని ఐరాసకు పపువా న్యూగినియా విజ్ఞప్తి చేసింది. విపత్తు కేంద్రం ద్వారా సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించింది. ప్రకృతి ప్రకోపంతో అల్లాడుతున్న పపువా న్యూగినియాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎయిర్‌ లిఫ్ట్‌ ఆపరేషన్‌ను చేపట్టనున్నట్లు తెలిపింది. ఆ దేశానికి అవసరమైన ఆహార వైద్య సామగ్రిని ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నట్లు వివరించింది.

పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్‌ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్​లోని కావోకలం గ్రామంపై శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రావిన్స్​లోని చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. అనేక ఇళ్లు పూర్తిగా నేలమట్టమై బండరాళ్లు, చెట్ల కింద కూరుకుపోయాయి. ఆదివారం నాటికి 670 మందికి పైగా మరణించి ఉంటారని ఐరాస శరణార్థుల ఏజెన్సీ అంచనా వేసింది. కానీ ఈ ప్రమాదంలో 2,000 మందికి పైగా సజీవ సమాధి అయ్యారని పపువా న్యూ గినియా ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version