Cricket

KKR vs RCB: సాల్ట్ కుమ్ముడు.. ఫామ్‍లోకి వచ్చిన శ్రేయస్.. కోల్‍కతా భారీ స్కోరు.. ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా కార్తీక్

Published

on

IPL 2024 KKR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో మ్యాచ్‍లో కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటింగ్‍లో అదరగొట్టింది. హౌం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కేకేఆర్ మరోసారి దుమ్మురేపింది. ఆర్సీబీతో నేటి (ఏప్రిల్ 21) మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు చేసింది.

సాల్ట్ మెరుపులు
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది కోల్‍కతా నైట్ రైడర్స్. ఓపెనర్ ఫిల్ సాల్ట్ మరోసారి వీర కుమ్ముడు కుమ్మాడు. 14 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో దుమ్మురేపాడు. బెంగళూరు బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో నాలుగు ఓవర్లలోనే 55 పరుగులు చేసింది కోల్‍కతా. అయితే, ఆ తర్వాత ఐదో ఓవర్లో సాల్ట్‌ను ఆర్సీబీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు.

సూపర్ ఫామ్‍లో ఉన్న కేకేఆర్ మరో ఓపెనర్ సునీల్ నరైన్ (10) విఫలం కాగా.. అంగ్‍క్రిష్ రఘువంశీ (3) కూడా నిరాశపరిచాడు.

ఫామ్‍లోకి శ్రేయస్
ఈ సీజన్‍లో వరుసగా విఫలమవుతున్న కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు ఫామ్‍లోకి వచ్చేశాడు. ఈ మ్యాచ్‍లో అర్ధ సెంచరీ చేశాడు. 36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు శ్రేయస్. ఈ సీజన్‍లో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. వెంకటేశ్ అయ్యర్ (16) కాసేపు నిలువగా.. అర్ధ శతకమైన వెంటనే శ్రేయస్ ఔటయ్యాడు. రింకూ సింగ్ (16 బంతుల్లో 24 పరుగులు) రాణించగా.. చివర్లో రమణ్‍దీప్ సింగ్ (6 బంతుల్లో 24 రన్స్; నాటౌట్) మెరిపించాడు. 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో అదరగొట్టాడు. ఆండ్రే రసెల్ (20 బంతుల్లో 27 పరుగులు నాటౌట్) చివరి వరకు ఉన్నా తన మార్క్ విధ్వంసం చేయలేకపోయాడు. అయితే, కోల్‍కతాకు మాత్రం భారీ స్కోరు దక్కింది. బెంగళూరు ముందు 223 పరుగుల భారీ లక్ష్యం ఉంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, కామెరూన్ గ్రీన్ చెరో రెండు, మహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గ్యూసన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఏడు మ్యాచ్‍ల్లో ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న ఆర్సీబీకి ఈ మ్యాచ్‍లో గెలువడం చాలా ముఖ్యం. మరి ఈ భారీ టార్గెట్‍ను బెంగళూరు ఛేదించగలదేమో చూడాలి.

Advertisement

కార్తీక్ రికార్డు ఇదే..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‍కు ఇది 250వ ఐపీఎల్ మ్యాచ్. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాత ఐపీఎల్‍లో 250 మ్యాచ్‍లు ఆడిన మూడో ఆటగాడిగా కార్తీక్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‍లో ఆరు జట్లకు కార్తీక్ ఆడాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ (2008-10, 2014), కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012-13), గుజరాత్ లయన్స్ (2016-17), కోల్‍కతా నైట్ రైడర్స్ (2018-21), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2015, 2022 నుంచి..) తరఫున కార్తీక్ ఆడాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున దినేశ్ కార్తీక్ ఆడుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version