Latest

Kejriwal’s own arguement: కోర్టులో సొంతంగా వాదించుకున్న కేజ్రీవాల్; ఈడీ అభ్యంతరం; ఇంతకీ కేజ్రీ కోర్టుకు ఏం చెప్పారు?

Published

on

Arvind Kejriwal custody: ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో గురువారం అరుదైన సంఘటన జరిగింది. తన తరఫు న్యాయవాదులు కోర్టు హాల్లో ఉన్నప్పటికీ.. తన వాదనను అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తనే స్వయంగా వినిపించారు. ఈ పద్ధతిని ఈడీ న్యాయవాదులు వ్యతిరేకించారు. కాగా, వాదనల అనంతరం కేజ్రీవాల్ ఈడీ కస్టడీని కోర్టు ఏప్రిల్ 1వ తేదీ.

మళ్లీ కస్టడీ కోరిన ఈడీ
ఆరు రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ (ED) మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. కేజ్రీవాల్ విచారణకు ఉద్దేశపూర్వకంగా సహకరించడం లేదని, ఆయన తరఫు న్యాయవాదులు ఆదాయపు పన్ను వివరాలను పంచుకోలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ (Arvind Kejriwal) కస్టడీని మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. ఢిల్లీ మద్యం కేసులో ఇతర నిందితులను కేజ్రీవాల్ ను కలిపి విచారించాల్సి ఉందని కోర్టుకు వివరించింది.

కేజ్రీవాల్ సొంత వాదన.. ఈడీ అభ్యంతరం
కెజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ (ED) తరఫు న్యాయవాది వాదనలు వినిపించిన తర్వాత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో తన వాదనను ప్రారంభించారు. అయితే, దీనికి ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్వయంగా వాదించుకోకూడదని, ఆయన తరఫు లాయర్లు వాదించాలని కోరింది.

కేజ్రీవాల్ కోర్టుకు ఏం చెప్పారు?
కోర్టులో కేజ్రీవాల్ తన వాదనను స్వయంగా వినిపించారు. తనను అరెస్టు చేసిన ఈ కేసు రెండేళ్ల నాటిదని, ఇప్పటి వరకు తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని కేజ్రీవాల్ చెప్పారు. తనపై మోపినవన్నీ కూడా నిరాధార అభియోగాలు అని కేజ్రీవాల్ తెలిపారు. ‘‘ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దర్యాప్తు సందర్భంగా కేవలం నలుగురి స్టేట్ మెంట్స్ లో మాత్రమే నా పేరు వచ్చింది. మొదటిది మనీష్ సిసోడియా పీఏ సి.అరవింద్ ఇచ్చిన స్టేట్ మెంట్ . నా సమక్షంలోనే డాక్యుమెంట్ ఇచ్చారని ఆయన ఆ స్టేట్ మెంట్ లో చెప్పారు. అయితే, చాలా మంది నన్ను కలవడానికి వస్తారు. అక్కడ వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సహజం. నన్ను అరెస్టు చేయడానికి ఇది తగిన కారణమా? రెండోది మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్. ఆయన తన కుటుంబ ట్రస్ట్ ఏర్పాటు కోసం నన్ను కలవడానికి వచ్చారు. వారు నా గురించి మాట మార్చడంతో ఆయన కుమారుడిని విడుదల చేశారు. మరొక స్టేట్మెంట్ శరత్ రెడ్డి ఇచ్చినది. ఆయన విజయ్ నాయర్ తో కలిసి నన్ను కలిశానని చెప్పారు. కానీ, ఈ స్కామ్ లో చేతులు మారిందని చెప్పిన డబ్బు ఎక్కడికి వెళ్లింది?’’ అని కేజ్రీవాల్ తన వాదన వినిపించారు.

నన్ను ఇరికించడమే ఈడీ లక్ష్యం..
కోర్టులో కేజ్రీవాల్ సుదీర్ఘంగా తన వాదన వినిపించారు. ‘‘సీబీఐ 31 వేల పేజీలు, ఈడీ 25 వేల పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాటిలో ఎక్కడ కూడా నా పేరు లేదు. మాగుంట రాఘవ రెడ్డి ఇచ్చిన 7 స్టేట్‌మెంట్లలో ఆరు స్టేట్‌మెంట్లలో నా పేరు లేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయి? శరత్‌ చంద్రా రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రూ. 55 కోట్లు బీజేపీకి డొనేషన్ ఇచ్చాడు’’ అని కేజ్రీవాల్ విమర్శించారు.

Advertisement

ఆప్ ను నాశనం చేయడమే ఈడీ లక్ష్యం
ఈడీకి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు రెండు లక్ష్యాలను నిర్దేశించారని కేజ్రీవాల్ విమర్శించారు. వాటిలో ఒకటి కేజ్రీవాల్ ను ఈ కేసులో ఇరికించడం, రెండవది ఆప్ పార్టీని నామరూపాలు లేకుండా నాశనం చేయడం.. అని విమర్శించారు. కాగా, వాదనల అనంతరం, కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీని కోర్టు ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడిగించింది.

ఆధారాలు ఉన్నాయి..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కోర్టుకు తెలిపింది. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా ఉన్న కేజ్రీవాల్ కు ఈ కుంభకోణంలో వ్యక్తిగతమైన పాత్ర ఉంది. ఈ కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బును ఆప్ గోవా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించారు’’ అని ఈడీ కోర్టుకు వివరించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నంత మాత్రాన చట్టానికి అతీతులు కాదని ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ వద్ద నుంచి సేకరించిన డిజిటల్ డేటాను పరిశీలించాల్సి ఉందని ఈడీ వాదించింది. కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని రికార్డు చేశామని, కానీ ఆయన దాటవేత సమాధానాలు ఇచ్చారని ఈడీ ఆరోపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version