National
కేజ్రీవాల్ అరెస్ట్ కేసులో హోరాహోరీ వాదనలు- తీర్పు రిజర్వ్ – Arvind Kejriwal Ed Case
Arvind Kejriwal ED Case : నేరం చేసినా ఎన్నికల కారణంగా మమ్మల్ని అరెస్టు చేయొద్దని చెప్పే హక్కు విచారణ ఖైదీలకు లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. బుధవారం దిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య హోరాహోరీ వాదనలు నడిచాయి. ఎన్నికల వేళ అరెస్టు చేయడాన్ని పిటిషనర్ ప్రధానంగా ప్రస్తావించారు. మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని, దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని ఈడీ వాదించింది. తమపై వస్తున్న ఆరోపణలను ఖండించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ED, నేరస్థులను అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును గురువారానికి రిజర్వు చేసింది.
ఎన్నికల సమయంలో ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందని, కేవలం తమను అవమానించడమే వారి లక్ష్యమని అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు చెప్పారు. ఎన్నికల వేళ తనను నిరోధించడమే వారి ఉద్దేశంగా కనిపిస్తోందని వాదించారు. ఆమ్‌ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సరైన ఆధారాలు లేకుండానే ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు.
అయితే, ఎన్నికల వేళ అరెస్టు చేశారంటూ పిటిషనర్ చేస్తున్న వాదనలను ఈడీ బలంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు, నేరస్థులను అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందేనన్నారు. ‘నేరం చేస్తాం, ఎన్నికల కారణంగా మమ్మల్ని అరెస్టు చేయొద్దు’ అని చెప్పే హక్కు విచారణ ఖైదీలకు లేదని స్పష్టం చేశారు. ఇటువంటి వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఏఎస్‌జీ తెలిపారు. నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లు తమవద్ద ఆధారాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి వాట్సాప్ చాట్‌లు, హవాలా ఆపరేటర్ల స్టేట్‌మెంట్‌లు ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
కెటిల్, టేబుల్, కుర్చీ ఇవ్వాలని ఆదేశం
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్‌కు ఎలక్ట్రిక్ కెటిల్‌ను అందించాలని జైలు అధికారులను అదేశించింది రౌజ్ అవెన్యూ కోర్టు. కెటిల్తోపాటు కుర్చీ, టేబుల్ ఇవ్వాలని అధికారులు చెప్పింది. వీటిని సమకూర్చాల్సిన బాధ్యత కేజ్రీవాల్ తరఫు న్యాయవాది, కుటుంబసభ్యులేదనని తెలిపింది. మార్చి 21న అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహాడ్ జైలు నంబర్2లో ఉన్నారు. ఇప్పటికే 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు న్యాయస్థానం తాజాగా ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.