National

కవితకు బెయిల్ ఇవ్వాలి, అరెస్ట్‌లో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయి- కవిత లాయర్ వాదనలు

Published

on

Kavitha Bail Petition : లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్లపై సోమ, మంగళవారాల్లో (మే 27,28) వాదనలు కొనసాగనున్నాయి. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసింది ఈడీ. కవిత బెయిల్ పిటిషన్ పై రేపు రిప్లయ్ ఫైల్ చేస్తామని సీబీఐ తెలిపింది. కవితపై జూన్ 7న చార్జిషీట్ దాఖలు చేస్తామంది సీబీఐ. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై కవిత తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి. ఈడీ అరెస్ట్ చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు వివరించారాయన.

”కవిత అరెస్ట్ లో అనేక చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయి. దానిపై సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద పిటిషన్ చేశాం. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆ కేసు జూలైకి వాయిదా పడింది. ఈలోగా బెయిల్ కోసం దరఖాస్తు చేశాం. మహిళకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఈ రక్షణ కింద కవితకు బెయిల్ ఇవ్వాలి. 2022 ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసినప్పుడు కవిత పేరు రాలేదు.

శ్రీనివాస్ రావు అనే వ్యక్తి కోటి రూపాయలు ఇచ్చారని అరుణ్ పిళ్లై స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇండో స్పిరిట్ లో వాటా కోసం ఇచ్చారని చెప్పారు. అప్పుడు తొలిసారిగా కవిత పేరు తెరపైకి వచ్చింది. అరుణ్ పిళ్లై ఆ తర్వాత తన వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు. అభిషేక్ బోయినపల్లి ఈ కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని సీబీఐ చెప్పింది. కవితను విచారణ జరపకుండా ఈ విషయం రిమాండ్ రిపోర్టులో పెట్టారు.

ఈడీ మార్చి 2023లో విచారణ జరిపింది. మహిళను కార్యాలయంలోకి పిలవొద్దని, సీఆర్పీసీ 160 ప్రకారం నడుచుకోవాలని చెప్పినా ఈడీ వినకుండా కార్యాలయానికి పిలిచింది” అని వాదనలు వినిపించారు న్యాయవాది విక్రమ్ చౌదరి. కాగా, వాదనలకు మరింత సమయం పడుతుండటంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

ఆదివారం సాయంత్రం లోపు సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ పై కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. సోమవారం రెండు కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించింది. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామంది ఢిల్లీ హైకోర్టు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version