National
Kanchanjungha Express: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదంలో భారీగా పెరుగుతున్న మృతులు.. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గూడ్స్
Kanchanjunga Express: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్ పరిధిలోని న్యూ జల్‌పాయ్‌గురి రైల్వే స్టేషన్‌కు 11 కిలోమీటర్ల దూరంలో సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రత కారణంగా బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. దీంతో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది మరణించగా.. 50 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారని ప్రాథమికంగా తెలుస్తోంది. రైలు ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు వెళ్తుండగా.. న్యూ జల్‌పాయ్‌గురి, రంగపాణి రైల్వే స్టేషన్ల మధ్య.. వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మరణించినట్లు స్థానికంగా ఉన్న ఓ అధికారి వెల్లడించారు. దాదాపు 50 మంది వరకు గాయపడి ఉంటారని అంచనా వేశారు. సంఘటనా స్థలానికి భారీగా అంబులెన్స్‌లను తరలించి.. గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇక సీల్దా ఈస్టర్న్ రైల్వే అధికారులు రంగపాణి రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు.
West Bengal | Sealdah Eastern Railway sets up a control desk at Rangapani station after the Kanchenjunga Express train rammed by a goods train at Ruidhasa in Darjeeling district pic.twitter.com/KLOY7Jn8rB
— ANI (@ANI) June 17, 2024
ఇక ఈ రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీ కొట్టినట్లు ఆమె తెలిపారు. ఈ రైలు ప్రమాద ఘటన షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నారు. డాక్టర్లు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఆమె ట్వీట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను దీదీ ఆదేశించారు.
అయితే ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ వెళ్లిన మార్గంలోనే వచ్చిన గూడ్స్ రైలు.. సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా ముందుకు వెళ్లడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ఈశాన్య నగరాలైన సిల్చార్, అగర్తలలను.. బెంగాల్‌తో కలిపేందుకు ఈ కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ నిత్యం ప్రయాణిస్తూ ఉంటుంది. చికెన్స్ నెక్ కారిడార్‌లో భాగమైన ఈ మార్గంలోనే తాజాగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈశాన్య భారతదేశాన్ని.. దేశంలోని మిగిలి ప్రాంతాలను కలిపే ఈ మార్గాన్నే చికెన్స్ నెక్ అని పిలుస్తారు. ఈ ప్రమాదంలో ఈ మార్గంలో వెళ్లే రైళ్లకు తీవ్ర ఆటంకం కలిగింది. డార్జిలింగ్‌కు వెళ్లే పర్యాటకులు ఎక్కువగా ఈ కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రస్తుత ఎండాకాలంలో సేదతీరేందుకు పర్యాటకులు కోల్‌కతాపాటు దక్షిణ బెంగాల్ వాసులు ఈ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు.