National

IT పరిశ్రమల ఒత్తిడి వల్లే 14గంటల వర్క్ ప్రతిపాదన ​: కర్ణాటక మంత్రి – 14 Hours Work In Karnataka

Published

on

14 Hours Work In Karnataka : కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పనివేళలు పెంచాలని సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోశ్‌ లాడ్‌ అన్నారు. ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచాలని సిద్ధరామయ్య ప్రభుత్వం తీర్మానించడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై స్పందించిన కార్మిక శాఖ మంత్రి, పనివేళలు పెంచాలని ఐటీ సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని వెల్లడించారు. ఉద్యోగుల పని వేళలను పెంచాలని నిర్ణయించింది ఐటీ మంత్రి కాదని స్వయంగా పరిశ్రమలేనని చెప్పారు.

ప్రభుత్వమే నిర్ణయిస్తుంది!
ఐటీ సంస్థల ఒత్తిడి మేరకే ఈ బిల్లు తీర్మానం వరకు వచ్చిందని, దీనిపై చర్చలు జరుగుతున్నట్లు మంత్రి సంతోశ్‌ వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దీనిపై పారిశ్రామికవేత్తలు బహిరంగ చర్చ జరపాల్సిన అవసరముందని మంత్రి సూచించారు. ప్రజలు కూడా దీనిపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని కోరిన సంతోశ్‌, అప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

IT, ITES, BPO రంగాల్లోని ఉద్యోగులు రోజులో 12 గంటలకు మించి పని చేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది. రోజులో గరిష్ఠంగా 14 గంటల చొప్పున పని చేయడానికి వీలు కల్పించేలా ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం ఓవర్‌టైమ్‌తో కలిపి గరిష్ఠంగా 10 గంటలు మాత్రమే పని చేయించేందుకు అనుమతి ఉంది. కర్ణాటక ప్రభుత్వం చేస్తోన్న కొత్త ప్రతిపాదనపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఐటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంతోష్‌లాడ్‌ను కలిసి అభ్యంతరం తెలిపారు. సాఫ్ట్‌వేర్ నిపుణుల మానసిక ఆరోగ్యంపై ఎక్కువ పనిగంటలు, తీవ్ర ప్రభావం పడుతున్నట్లు చెప్పారు.

మరోవైపు, ఉద్యోగి రోజులో గరిష్ఠంగా ఎన్నిగంటలు పని చేయాలనే దానిపై కటాఫ్‌ ఏదీ లేదని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. 125 గంటల గరిష్ఠ పరిమితి వల్ల కంపెనీలు ఉద్యోగులతో తమకు కావాల్సిన రోజులు లేదా వారాల్లో నిర్దిష్ట పరిమితి మేరకు పనిచేయించుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వారంలో 48 గంటలకు మించి పనిచేయించకూడదని కార్మిక చట్టాలు చెబుతున్నాయని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గుర్తుచేశారు. పని గంటల పెంపు వల్ల ఉద్యోగులు మరింత మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version