Latest
IT Employees: ఐటీ ఉద్యోగులకు షాక్.. దిగ్గజ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేయకుంటే తీసేస్తామంటూ..!
Cognizant Employees: నాస్‌డాక్ లిస్టెడ్ దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. పలు మార్లు చెప్పినా ఉద్యోగులు.. ఆఫీసుకు రాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. తమ ఆదేశాల్ని ధిక్కరిస్తే ఊరుకునేదే లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 15న కాగ్నిజెంట్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గురించి కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు హెచ్చరికల్ని పంపినా ఆఫీసులకు రానివారిపై నిఘా పెట్టింది. సంబంధిత బిజినెస్ యూనిట్ సీనియర్లకు సమాచారం ఇచ్చారా లేరా అని ఆరా తీసింది. తమ మార్గదర్శకాల్ని లెక్కచేయని వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని ఆ లేఖలో పేర్కొంది. ఆఫీసులకు రాని వారు.. ఇప్పుడు వస్తే రావాలని.. లేకపోతే లేఆఫ్స్ చేస్తామని హెచ్చరించింది.
‘మా నియమ నిబంధనలు, ఆదేశాల్ని పాటించని వారు తీవ్ర దుష్ర్పవర్తనకు పాల్పడినట్లే పరిగణించాల్సి వస్తుంది. ఇది కంపెనీ నిబంధనలకు విరుద్దం. వీటిని ఉల్లంఘించిన వారికై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. కొన్ని సార్లు ఇది టెర్మినేషన్‌కు కూడా దారి తీయొచ్చు.’ అని కంపెనీ ఒక ఉద్యోగికి రాసిన లేఖలో ఇలా వెల్లడించింది.
అయితే కాగ్నిజెంట్ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాలని.. మిగతా రోజులు వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ మేరకు అప్పట్లోనే కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ ఉద్యోగులకు ఒక మెమోలో పేర్కొన్నారు. కానీ వీటిని ఉద్యోగులు పెద్దగా పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగ్నిజెంట్ సంస్థలో మొత్తం 3,47,700 మంది ఉద్యోగులు ఉండగా.. దీంట్లో 2,45,000 మంది ఇండియాలోనే ఉండటం విశేషం. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇండియాలోనే ఎక్కువగా ఉన్నట్లు వార్షిక నివేదికలో సంస్థ తెలిపింది. ఈ కంపెనీకి భారత్‌లో ప్రధాన ప్రత్యర్థులైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో కూడా 2023 చివర్లోనే ఉద్యోగులు .. ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి.
టీసీఎస్.. ఏకంగా వారంలో 5 రోజులు కూడా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని స్పష్టం చేయడం గమనార్హం. ఇక ఇటీవల కాగ్నిజెంట్ ఈ క్యాలెండర్ ఏడాది మొదటి ఆర్థిక సంవత్సరం ఫలితాల్ని ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 1.1 శాతం మేర తగ్గి 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. నికర లాభం 6 శాతం పతనమై 546 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇక్కడ ఉద్యోగుల సంఖ్య ఒక్క త్రైమాసికంలో 3300 తగ్గింది. మొత్తంగా సంవత్సరంలో చూసినట్లయితే ఏకంగా 7100 వరకు తగ్గింది. ఇతర చాలా ఐటీ కంపెనీల్లో కూడా ఉద్యోగుల సంఖ్య ఇదే స్థాయిలో పడిపోయింది.