International

‘ఇజ్రాయెల్‌ విషయంలో మాకు సపోర్ట్​ ఇవ్వండి’- ముస్లిం దేశాలను కోరిన ఇరాన్ – OIC Holds Emergency Meeting

Published

on

Iran urges OIC to unite against Israel : ఇజ్రాయెల్‌ దుందుడుకు చర్యలు నుంచి రక్షించుకునే విషయంలో ముస్లిం దేశాలు తమకు అండగా నిలబడాలని ఇరాన్‌ కోరింది. సౌదీ అరేబియా జెడ్డాలో జరిగిన ఇస్లామిక్‌ సహకార సంస్థ- (ఓఐసీ) అత్యవసర సమావేశంలో పాల్గొన్న ఇరాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియా హత్య నేపథ్యంలో ఇరాన్‌ వినతిపై, ఇస్లామిక్‌ సహకార సంస్థ సమావేశమైంది.

హనియా హత్యను పాశ్చాత్య దేశాలు ఖండించలేదని, ప్రాంతీయ స్థిరత్వంపై వాటికి ఆసక్తి లేదని ఇరాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి అలీ బఘెరీ కని ఆరోపించారు. హనియా హత్యలో ఇజ్రాయెల్‌, అమెరికా పాత్ర ఉందని ఇరాన్‌ ఆరోపిస్తోంది. దానికి తగ్గ ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్‌ ప్రతినబూనింది. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ గురువారం తెల్లవారుజామున, ఒంటిగంట నుంచి నాలుగు గంటల వరకు మధ్య ఇరాన్‌ గగనతలంలోకి వెళ్లవద్దని ఈజిప్టు తమ విమానయాన సంస్థలను ఆదేశించింది.

హెజ్​బొల్లా కమాండర్​ మృతి
మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్‌లో ట్యాంకు విధ్వంసక క్షిపణి దాడులకు కారకుడైన హెజ్‌బొల్లా కమాండర్‌ హసన్‌ బుధవారం దక్షిణ లెబనాన్‌లో డ్రోన్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. హెజ్‌బొల్లా స్థావరాలు, భవనాలపై వైమానిక దాడులు జరిగాయి. ప్రస్తుత ఘర్షణలు మరింత పెంచాలని చూస్తే హెజ్‌బొల్లా మూల్యం చెల్లుంచుకోక తప్పదని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లా మధ్య రోజంతా కాల్పులు జరిగాయి.
అంతకుముందు ఇజ్రాయెల్‌పై తీవ్రస్థాయి ప్రతిఘటన తప్పదని హెజ్‌బొల్లా నాయకుడు హసన్‌ నజరుల్లా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ మద్దతు ఉన్న హూతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ వైమానిక దాడులు నిర్వహించాయి.

ఇదిలాఉండగా, పశ్చిమాసియాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అమెరికా – మరిన్ని బలగాల్ని ఆ ప్రాంతానికి బుధవారం దింపింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే, దౌత్యమార్గాల ద్వారా ఇరాన్‌కు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇజ్రాయెల్‌కు గట్టిగా బుద్ ధిచెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న ఇరాన్‌, మిత్రదేశమైన రష్యా నుంచి ఆయుధాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది. రష్యా ఇరాన్‌కు అధునాతన రాడార్‌ వ్యవస్థలతో పాటుగా క్షిపణి విధ్వంసక వ్యవస్థలను పంపిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా నేత సెర్గీ షొయిగు ఇరాన్‌ వచ్చి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఆయుధాల సరఫరాలు మొదలయినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version