Hashtag

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి 6నెలలు- 33వేలు దాటిన మరణాలు- గాజాలో ఘోర పరిస్థితులు! – Israel Hamas War Latest

Published

on

Israel Hamas War Latest : ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తవ్వగా, భీకర పోరులో 33 వేలకుపైగా మంది మరణించారు. హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. మరోవైపు గాజాలో రోజురోజుకూ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి.
ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పైకి దూసుకొచ్చిన వేలాది రాకెట్లు
ప్రతిగా హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో టెల్‌అవీవ్‌ సేనల దాడులు
ఇలా ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి నేటితో ఆరు నెలలు పూర్తయింది. 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హమాస్‌ సొరంగాల్లో చాలా వరకు ధ్వంసం చేశామని, 13 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్‌ చెబుతోంది. మరోవైపు ఇప్పటికీ 100కు పైగా బందీలు మిలిటెంట్ల చెరలోనే ఉండటం, గాజాలో 33 వేలమంది ప్రాణాలు కోల్పోవడం, పాలస్తీనీయుల సమస్యలు మొత్తం ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.

అసలు ఎలా మొదలైంది?
Israel Hamas War Latest : గతేడాది అక్టోబర్‌ 7వ తేదీ తెల్లవారుజామున ఆపరేషన్‌ అల్‌-అక్సా స్ట్రామ్‌ పేరుతో మెరుపుదాడికి పాల్పడ్డారు హమాస్‌ మిలిటెంట్లు. దాదాపు 1200 మందిని బలిగొన్నారు. 250 మందికిపైగా బందీలుగా చేసుకుని, గాజాకు తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇజ్రాయెల్‌. వెంటనే ప్రతి దాడులను మొదలుపెట్టింది. ఉగ్రవాదుల అంతంతోపాటు బందీల విడుదలే లక్ష్యంగా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించింది.

అయితే ఇప్పటివరకు 109 మంది బందీలు సురక్షితంగా విడుదలయ్యారు. ముగ్గురిని సైన్యం నేరుగా కాపాడింది. 36 మంది వరకు బందీలు చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారని హమాస్‌ చెబుతోంది. మరోవైపు, తమ వారిని విడిపించాల్సిందిగా ప్రధాని నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

17 లక్షల మందికిపైగా!
ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 33 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. మృతుల్లో 70 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని పేర్కొంది. ఐరాస వివరాల ప్రకారం దాదాపు 17 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. స్థానికంగా 56 శాతానికిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి.

అలా చేస్తే 23 లక్షల మంది!
యుద్ధం మొదట్లో గాజా సరిహద్దులను దిగ్బంధించడం వల్ల ఆహారం, ఇంధనం, ఔషధాలు, మంచినీరు, నిత్యావసర సామగ్రికొరతతో పౌరులు అల్లాడారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రతి ఒక్కరు కూడా ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారు. 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ రఫాకు దాడులను విస్తరిస్తే మొత్తం 23 లక్షల మంది జనాభాలో సగం మంది క్షుద్బాధకు లోనవుతారని ఇటీవల హెచ్చరించింది కూడా.

కాల్పుల విరమణ ఎప్పుడో?
అయితే దాడులను వెంటనే ఆపాలని ఇజ్రాయెల్‌ను అనేక దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రత మండలి, మానవహక్కుల మండలిలు తీర్మానం రూపంలో గొంతు ఎత్తాయి. నవంబరులో ఓసారి కాల్పుల విరమణ సాధ్యమైనప్పటికీ ఈ అంశం చర్చల దశలోనే నిలిచిపోయింది. దక్షిణాఫ్రికా, కొలంబియాలు యుద్ధ పరిణామాలను అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాయి. హమాస్‌ను అంతం చేసేవరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు. ద్విదేశ పరిష్కారాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన తీరుపై మిత్రదేశం అమెరికా సైతం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version