International
ఇరాన్ నూతన అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్.. సంప్రదాయవాదిపై విజయం
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణ వాది మసూద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీను ఆయన ఓడించారు. లెక్కించిన మొత్తం 3 కోట్ల ఓట్లలో డాక్టర్ పెజెష్కియాన్‌కు అనుకూలంగా 1.6 కోట్లకుపైగా ఓట్లు ( 53.3 శాతం).. జలీలీకి 1.3 కోట్లకుపైగా ఓట్లు ( 44.3 శాతం) ఓట్లు వచ్చాయి. దాంతో పెజిష్కియాన్ ఎన్నికైనట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఎన్నికల విభాగం అధికార ప్రతినిధి మెహసెన్ ఇస్లామీ ప్రకటన చేశారు. అయితే, జూన్ 28 న జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో కేవలం 40 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కాగా.. ఆ రౌండ్‌లో ఏ అభ్యర్థికి మెజారిటీ రాలేదు.
మే నెలలో ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అధ్యక్షుడిగా పెజెష్కియాన్ ఎన్నికవడంపై రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్‌వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నింటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకుపచ్చ జెండాలను ఊపుతూ ఆనందంతో యువత డ్యాన్సులు చేస్తుండటం, హారన్లు మోత మోగిస్తూ కార్లలో ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
మాజీ హార్ట్ సర్జన్ అయిన డాక్టర్ పెజిష్కియాన్.. ఇరాన్ మోరల్ పోలీసింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆంక్షల వల్ల ఏకాకిగా మారిన ఇరాన్‌ను తిరిగి ప్రపంచంతో కలుపుతానని ఆయన వాగ్దానం చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం పెజిష్కియాన్ మాట్లాడుతూ.. తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజల అభిమానం, ప్రేమే తనను అధ్యక్షుడ్ని చేశాయని అన్నారు. ‘అందరికీ స్నేహ హస్తం అందిస్తాం.. మనమందరం ఈ దేశ ప్రజలం.. దేశ ప్రగతికి అందరం ఉపయోగపడాలి’ అని ఇరాన్ అధికారిక టెలివిజన్‌లో పేర్కొన్నారు.
ఇక, తొలి దశలో తక్కువ శాతం పోలింగ్ నమోదుకావడంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తొలి రౌండ్‌లో ఊహించిన దానికంటే తక్కువగా ఓటింగ్ నమోదైందని, అయితే ఇది వ్యవస్థకు విరుద్ధమైన చర్య కాదని ఆయన అన్నారు.
గాజా యుద్ధంతో ఘర్షణలు, అణ్వాయుధ కార్యక్రమంపై పశ్చిమ్ దేశాలతో విబేధాలు, దేశీయంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకున్న తరుణంలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 6.1 కోట్ల మంది ఓటర్లకుగానూ తొలి దశలో 40 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1979లో ఇరాన్ విప్లవం తర్వాత మొదటిసారి అక్కడ తక్కువ స్థాయిలో ఓటింగ్ నమోదయ్యింది.
ఇక, 2022లో హిజాబ్ ధరించలేదన్న కారణంతో అరెస్ట్ చేసిన మాషా అమేనీ అనే యువతి పోలీస్ కస్టడీలో ఉండగా చనిపోయిన ఘటన ఇారాన్‌ను కుదిపేసింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. యువత వీధుల్లోకి వచ్చి మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా గొంతెత్తింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.