Cricket
IPL 2024 : బౌండరీ లైన్ వద్ద అద్భుత ఫీల్డింగ్‌తో ఢిల్లీ జట్టును గెలిపించిన ట్రిస్టాన్ స్టబ్స్.. వీడియో వైరల్
IPL 2024 DC vs GT : ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగాసాగిన ఈ మ్యాచ్ లో నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో ఢిల్లీ నాల్గో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 224 పరుగులు చేసింది. 225 పరుగుల లక్ష్య ఛేధనలో గుజరాత్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 220 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ప్లేయర్ స్టబ్స్ బౌండరీ లైన్ వద్ద అద్భుత ఫీల్డింగ్ గుజరాత్ జట్టు ఓటమికి కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 18 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ సమయంలో రషీద్ ఖాన్, సాయి కిషోర్ క్రీజులో ఉన్నారు. రషీద్ ఖాన్ క్రీజులో ఉండటంతో గుజరాత్ జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకుంది. 19వ ఓవర్ రసిక్ సలామ్ వేయగా.. తొలి బంతిని రషీద్ ఖాన్ ఫోర్ కొట్టాడు. రెండో బంతిని సిక్స్ కొట్టే క్రమంలో బౌండరీ లైన్ వద్ద స్టబ్స్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ, వీలుకాకపోవటంతో గాల్లో ఉండగానే చేతిలో బంతిని మైదానంలోకి విసిరాడు. దీంతో ఆరు పరుగులు రావాల్సింది.. ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 19వ ఓవర్లో మొత్తం గుజరాత్ టైటాన్స్ 18 పరుగులు రాబట్టింది. దీంతో స్కోర్ 200 పరుగులు దాటింది.
చివరి ఓవర్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయానికి 19 పరుగులు చేయాల్సి ఉంది. ముఖేష్ కుమార్ బౌలింగ్ వేశాడు. తొలి రెండు బంతుల్లో రషీద్ ఖాన్ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే, ఆ తరువాత రెండు బంతులు భారీ షాట్స్ కొట్టే క్రమంలో రషీద్ విఫలమయ్యాడు. 5వ బంతిని రషీద్ సిక్సర్ గా మలిచాడు. చివరి బాల్ కు ఐదు పరుగులు చేయాల్సి ఉంది. రషీద్ ఖాన్ లాంగ్ ఆన్ వైపు షాట్ ఆడాడు. కానీ, అది ఫీల్డర్ వైపు వెళ్లింది. దీంతో ఒక్క పరుగు మాత్రమే రావడంతో ఢిల్లీ జట్టు నాలుగు పరుగులు తేడాతో విజయం సాధించింది. స్టబ్స్ 19వ ఓవర్లో ఐదు పరుగులు సేవ్ చేయకుంటే గుజరాత్ జట్టు సునాయాసంగా విజయం సాధించేది. దీంతో స్టబ్స్ బౌండరీలైన్ వద్ద చేసిన అద్భుత ఫీల్డింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.