Andhrapradesh
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వారికి మాత్రమే..!
AP Government : వేసవి సెలవులు ముగిశాయి. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా టెన్త్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కాలేజీలకు పోయే విద్యార్థులున్న తల్లిదండ్రులు వారి పిల్లలకోసం టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ కొనేపనిలో నిమగ్నమయ్యారు. ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు సిద్ధమైంది. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్ లు అందించేలా అధికారులు జీవో జారీ చేశారు. అయితే, ఈ అవకాశం కేవలం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల కోసం మాత్రమే.
ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, హై స్కూల్ ప్లస్ లలో సుమారు రెండు లక్షల మందికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్ లను పంపిణీ చేయనున్నారు. వచ్చేనెల 15లోగా పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయాలని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో విద్యనభ్యసిస్తున్న సుమారు రెండులక్షల మంది విద్యార్థులకు ఉపయోగం కలగనుంది.
ఇటీవలే ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే విద్యాశాఖపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. స్కూళ్లలో డ్రాపౌట్స్, మధ్యాహ్న భోజనం నాణ్యత సహా పలు అంశాలపై అధికారులతో నారా లోకేశ్ చర్చించారు. ఈ క్రమంలో జూలై 15 నాటికల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఒక్కో విద్యార్థికి 12 నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేూసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.