National

Infosys Offered: ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ బంపర్‌ ఆఫర్‌.. ఆ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు.!

Published

on

ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ తమ ఉద్యోగులకు ఆకర్షణీయ బదిలీ ప్యాకేజీని ప్రకటించింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో నెలకొల్పిన డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో పనిచేయడానికి ముందుకొస్తే రూ.8 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. ఈమేరకు ఉద్యోగులకు ఇటీవల ఈమెయిల్‌ ద్వారా సమాచారాన్ని అందించింది. అభివృద్ధి చెందడానికి మెరుగైన అవకాశాలున్న హుబ్బళ్లిలో పనిచేసే ప్రతిభావంతుల కోసం వేచి చూస్తున్నామని అందులో పేర్కొంది. ప్రాజెక్టు డెవలప్‌మెంట్‌ విధుల్లో ఉన్న బ్యాండ్‌-2, ఆ పైస్థాయి ఉద్యోగులకు బదిలీ ప్రోత్సాహకాలు అందిస్తామని ఇన్ఫోసిస్‌ తెలిపింది. భారత్‌లోని ఏ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నుంచైనా ఉద్యోగులు ఇక్కడికి రావొచ్చని పేర్కొంది. బ్యాండ్‌ 3, అంతకంటే దిగువస్థాయి ఉద్యోగులకు బదిలీ సమయంలో రూ.25,000 అందిస్తామని తెలిపింది. ఆ తర్వాత ప్రతీ ఆరు నెలలకు రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇస్తామని వెల్లడించింది. మొత్తం మీద వీరు రూ.1.25 లక్షల ప్రోత్సాహకాలు అందుకోనున్నారు. అలా బ్యాండ్‌ 4 ఉద్యోగులకు రెండున్నర లక్షలు, బ్యాండ్‌ 5 ఉద్యోగులకు రూ.5 లక్షలు, బ్యాండ్‌ 6 స్థాయి ఉద్యోగులకు రూ.8 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది.

హుబ్బళ్లి టైర్‌-2 సిటీగా పేరొందింది. ఇక్కడ పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవటంతో కంపెనీ ఈ పాలసీని తీసుకొచ్చింది. ముఖ్యంగా ముంబయి-కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో హుబ్బళ్లి ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌కు సంబంధించి చర్చ జరిగింది. వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రారంభించిన ఈ కేంద్రంలో మొక్కలు మాత్రమే పెరుగుతున్నాయని ఓ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు అక్కడ కార్యకలాపాలు ప్రారంభం కాలేదన్నారు. ఉద్యోగ కల్పన జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం 58 ఎకరాలు కేటాయించిందని గుర్తుచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇన్ఫోసిస్‌ తాజా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌ తాజాగా ప్రకటించిన ప్రోత్సాహక పాలసీని కర్ణాటక పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ కొనియాడారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. టెక్‌ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలు, ఉద్యోగుల సంక్షేమంలో ఇన్ఫోసిస్‌ నిబద్ధతకు ఇది నిదర్శమని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version