International
భారత్ సూపర్‌పవర్ కావాలనుకుంటుంటే.. మన దేశమేమో..: పాక్ నేషనల్ అసెంబ్లీలో ఆసక్తికర కామెంట్స్
సూపర్‌పవర్‌గా అవతరించాలని భారత్ కలలుగంటుంటే తమ దేశం మాత్రం దివాళా నుంచి తప్పించుకోవడానికి అడుక్కుంటోదంటూ పాకిస్థాన్ ప్రతిపక్ష నేత, జేయూఐ-ఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ అన్నారు. దీనికి బాధ్యత ఎవరిదంటూ తమ నేతలను ప్రశ్నించారు. భారత్, పాక్ మధ్య ఎంత తేడా ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో రెహ్మాన్ మాట్లాడారు. ప్రస్తుత పార్లమెంట్ చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. అదృశ్య శక్తులు తెరవెనుక నుంచి నిర్ణయాలు తీసుకుంటూ, పాక్ నేతలను నియంత్రిస్తున్నాయని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న నేతలు తోలుబొమ్మలుగా మిగిలిపోతున్నారని అన్నారు.
ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించేలా పార్లమెంట్ నిజంగా వ్యవహరిస్తోందా? అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజభవనాల్లో ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడాన్ని ఖండిస్తున్నానని వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి కావాల్సింది ఎవరో ప్రభుత్వ అధికారులే నిర్ణయిస్తున్నారని రెహ్మాన్ చెప్పారు. ఇంకెన్నాళ్లు రాజీపడాలని ఆయన నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న నేతలుగా ఉన్నప్పటికీ ఇంకెన్నాళ్లు విదేశీ శక్తుల సాయం తీసుకోవాలని ప్రశ్నించారు.