International
భారత్ చైనా ను ఎలా అధిగమిస్తుందో తెలుసా …..ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
భారత్ కేవలం చైనాతో భౌగోళిక సరిహద్దును పంచుకోవడమే కాకుండా.. ఆర్ధిక వ్యవస్థలో కూడా ప్రత్యర్థిగా కూడా ఉంది. చైనా జీడీపీ భారత్‌తో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువ.
అయితే భారత్ భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థను అధిగమించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.
పారిశ్రామిక రంగంలో చైనాను అధిగమించేందుకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించేందుకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని నారాయణ మూర్తి అన్నారు. పౌరుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలి. ఆదాయంతో పాటు ఏటా లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించాలి. అప్పుడే మన దేశం చైనాను తప్పకుండా అధిగమిస్తుందని అన్నారు.
మానవ వనరుల ఉత్పాదకతను పెంచడానికి ‘ఏఐ’ను తగినంతగా ఉపయోగించాలి. సాధారణ ఏఐ ప్రజల సామర్థ్యాన్ని పెంచుతూ సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. ఇది మన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
దేశీయ తయారీని పెంచడానికి భారత ప్రభుత్వం ఈ దశాబ్దం ప్రారంభంలో సుమారు రూ. 2.7 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ దశాబ్దం చివరి నాటికి, భారతదేశ వార్షిక జీడీపీ వృద్ధి శాతం 9కి చేరుకోవచ్చు. చైనా వృద్ధి రేటు 3.5 శాతానికి పడిపోవచ్చు. రానున్న రోజుల్లో కూడా ఇదే జోరు కొనసాగితే చైనాను భారత్ అధిగమించగలదని నారాయణ మూర్తి పేర్కొన్నారు.