Spiritual

యువతలో విపరీతంగా పెరిగిన భక్తి భావం, ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన.. ఈ మార్పునకు కారణం అదేనా?

Published

on

Spirituality In Youth : ఉరుకుల, పరుగుల జీవితం.. ఏ వృత్తిలో అయినా తప్పని ఒత్తిడి… ఆర్థిక, వృత్తి పరమైన లక్ష్యాల సాధనలో నిరంతరం మునిగి తేలాల్సిన పరిస్థితులు. ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. యువతపై ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంది. అందుకే కుదిరినప్పుడల్లా వీలైనంత ప్రశాంతంగా గడిపేందుకు, మనసును సాంత్వన పరుచుకునేందుకు, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు.. భగవంతుడే అంతిమ సత్యం అన్న విషయాన్ని గ్రహించేందుకు మనిషి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక కరోనా సృష్టించిన కల్లోలాన్ని అనుభవించిన తర్వాత …జీవితంలోని కల్లోల పరిస్థితులను అధిగమించడానికి ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శన తప్ప మరో మార్గం కనిపించడం లేదు.

ఎప్పుడు చూసినా ఆలయాల్లో భక్తుల రద్దీ..
కృష్ణారామా అనుకుంటూ తీర్థయాత్రలు చేయాల్సిన వయసు అని.. వృద్ధాప్యం గురించి తెలుగు నాట ఓ సామెత ఉంది. బాధ్యతలన్నీ తీరిపోయి.. పిల్లలు, వారి పిల్లలు ఎవరి పనుల్లో వారు నిమగ్నమవ్వడంతో శేషజీవితం ప్రశాంతంగా గడిపేందుకు, మరణం తర్వాత ఏమవుతుందన్న సందేహాలకు దూరం జరిగేందుకు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరే వారు. కానీ ఇప్పుడా సామెత మార్చి రాయాల్సిన సందర్భం వచ్చేసింది. ఖాళీ దొరికితే ఆలయాలకు పరుగులు తీస్తున్న వారి జాబితా అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రత్యేక పూజలు, పొర్లు దండాలు, ఉపవాసాలు, మొక్కులు అంటూ ఎప్పుడు చూసినా ఆలయాల్లో భక్తుల కనిపిస్తూనే ఉన్నారు.

పుణ్యక్షేత్రాల సందర్శనకు యువత పోటీ..
ఒకప్పుడు వెకేషన్ అంటే ఏ గోవానో ఇంకేదో బీచ్‌కు వెళ్లడమో అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఈ వేసవికాలంలో దేశంలో ఎక్కువమంది ప్రజలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులన్నీ ఆలయాల సందర్శనకు సంబంధించినవే. దక్షిణ భారతదేశంలో ఆలయాలతో పాటు చార్ ధామ్, అయోధ్య, వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శించేందుకు యువత పోటీ పడింది. పుణ్యక్షేత్ర దర్శనం, పర్యాటక ప్రాంతాల సందర్శనం కలిపి ఉన్న టూరిజం ప్యాకేజీలతో కొన్ని కంపెనీలకు కాసుల వర్షం కురిసింది. మన దేశంలోనే కాదు విదేశాల నుంచీ భక్తులు మన ఆధ్యాత్మిక క్షేత్రాలకు భారీగా తరలివస్తున్నారు.

ట్రావెల్ ఇండస్ట్రీకి భారీగా లాభాలు..
ఆధ్యాత్మిక పర్యాటకం, మతపరమైన పర్యాటకంగా పిలుస్తున్న ఈ ట్రెండ్‌తో ట్రావెల్ ఇండస్ట్రీకి భారీగా లాభాలు వస్తున్నాయి. ఏటికేడు ఆదాయం రెట్టింపవుతోంది. ఆధ్యాత్మిక భావంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకునే పరిస్థితులుండడం, ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త ఉపశమనం లభించడం, జీవితంలో ఎదురైన సమస్యలకు సావధానంగా ఆలోచించి పరిష్కారాలు పొందవచ్చన్న అభిప్రాయం, ఆలయాలకు వెళ్తే మానసికంగా కలిగే ప్రశాంతత, ఆలోచనల్లో వచ్చే సానుకూల మార్పు, ఆధ్యాత్మిక సంతృప్తి వంటివి పెద్ద వాళ్లతో పాటు యువతనూ ఆధ్యాత్మిక పర్యటనల వైపు ఆకర్షిస్తోంది. సహజంగానే భారతీయుల్లో భక్తిభావం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రస్తుతం మారిన సామాజిక పరిస్థితులతో భక్తి.. మనసుకు సాంత్వన కలిగించే సాధనంగా మారింది.

కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్టుగా మారిపోయిన మనిషి జీవితం..
కరోనా సమయంలో అడుగుతీసి అడుగు బయటపెట్టాలన్నా అందరూ భయపడ్డారు. అయినప్పటికీ ఎంతో నష్టం జరిగింది. కొందరు ఆప్తులను పోగొట్టుకున్నారు. మరికొందరు ఆస్తులు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఎన్ని డబ్బులున్నా, ఇంకెన్ని రకాల సౌకర్యాలున్నా కళ్లముందు అయిన వారు చనిపోతుంటే మరికొందరు నిస్సహాయంగా చూస్తుండి పోవాల్సిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా మిగిల్చిన అనారోగ్యం చాలామందిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలా భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్టుగా మనిషి జీవితం మారిపోయింది.

Advertisement

ఆధ్యాత్మిక చింతన పెంచిన కరోనా పరిస్థితులు..
కల్లోల కాలంలో ఎదురైన జీవితానుభావాలు భారత్‌లో ఎక్కువమంది ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంచాయి. విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు భారత్ వచ్చే ఎన్‌ఆర్‌ఐలు కూడా స్వదేశానికి వచ్చిన వెంటనే ముందుగా తిరుమల సహా ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకుంటున్నారు. భగవంతుని సన్నిధిలో మనసును ప్రశాంతంగా మార్చుకుని.. జీవితంలోని కష్టనష్టాల భారాన్ని దేవునిపై వదిలేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version