National
ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటేసి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు అల్లాడుతున్నారు. హీట్ వేవ్ నేపథ్యంలో ఢిల్లీలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రాజస్థాన్‌లో ఎండ వేడిమికి మంగళవారం ఒక్కరోజే 13 మంది మృతి చెందారు. రాజస్థాన్ రాష్ట్రంలో గత ఆరు రోజుల్లో వడదెబ్బ కారణంగా 48 మంది మృతి చెందారు. టోంక్‌లో భార్యాభర్తలు సహా ఐదుగురు, పాలీలో ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక వృద్ధుడు, జైపూర్‌లో 22 ఏళ్ల యువకుడు ఎండ వేడిమి తాళలేక మృతి చెందాడు. ఉదయపూర్, బరన్‌లలో మరో ఐదుగురు మృతి చెందారు. అయితే, వచ్చే రెండు రోజుల్లో యుపీ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా వాయువ్యం నుండి తూర్పు దిశగా వీచే గాలి కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. మే 30 నుంచి అరేబియా సముద్రం నుంచి వీచే గాలుల ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని, మే 31 నాటికి నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ అంచనా వేసింది. మంగళవారం 50 ప్రాంతంల్లోపైగా 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 50.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. ఢిల్లీ మంగేష్‌పూర్, నరేలాలో గరిష్ట ఉష్ణోగ్రత 49.9 డిగ్రీలు నమోదు కాగా.. సాధారణం కంటే 6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఢిల్లీలో ఉదయం 7 గంటలకే 32 డ్రిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండటంతో ఎండవేడిమికి ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. బుధవారం గరిష్టంగా 47 డిగ్రీలు, కనిష్టం గా 33 డ్రిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. ఎండ వేడిమి పెరగడంతో ఢిల్లీలో విద్యుత్ వినియోగంకూడా పెరిగింది. ఢిల్లీ జూపార్కులో జంతువులు ఎండవేడిమి తట్టుకునేలా జూ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు.. జూన్ మొదటి వారానికి కేరళకు నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి.