National
భారత్‌లో అంబానీ ఇంటికన్నా పెద్ద నివాసం ఇదే – 500 ఎకరాల్లో, 176 గదులు – చూస్తే కళ్లు చెదిరిపోతాయ్! – Laxmi Vilas Palace Details
Laxmi Vilas Palace : మన దేశంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు ఏదైనా ఉందంటే అది ముఖేష్ అంబానీ ఆంటీలియానే అనుకుంటారు చాలా మంది. అయితే, అంతకంటే అతిపెద్ద ప్రైవేట్ నివాసం ఒకటి ఉందని మీకు తెలుసా? అదే వందల ఎకరాల్లో ఉండే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవనం ‘లక్ష్మీ విలాస్ ప్యాలెస్’. ఈ ప్యాలెస్ బ్రిటిష్ రాజకుటుంబం నివసించే బంకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది. లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను చూడాలంటే రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఎంత ఊహించుకున్నా.. అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది ఈ రాజభవనం. ఇంతకీ ఈ ప్యాలెస్ ఏ రాష్ట్రంలో ఉంది ? దీని విశేషాలు ఏంటీ ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలోనే..
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, విలువైన ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ గుజరాత్‌లోని వడోదర నగరంలో ఉంది. ఈ ప్యాలెస్‌ను 1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు నిర్మించారు. రాజభవన నిర్మాణానికి ముఖ్య శిల్పిగా మేజర్ చార్లెస్ మాంట్ పని చేశారు. అద్భుతమైన ఈ రాజ మందిర నిర్మాణాన్ని ఇండో-సారసెనిక్ శైలిలో నిర్మించారు. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్‌లో, కళ్లు చెదిరిపోయేలా హాళ్లు, తోటలు, ఫౌంటెన్‌లు ఉన్నాయి. అలాగే ఈ ప్యాలెస్ 176 లగ్జరీ గదులతో ఉంది. ఆ కాలంలోనే లక్ష్మీ విలాస్‌ను నిర్మించడానికి శాయాజీరావ్ గైక్వాడ్ – III సుమారు రూ.27 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇది అప్పట్లో చాలా పెద్ద మొత్తం.
కళ్లు చెదిరిపోతాయి..
లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లోని దర్బారు హాలు వైశాల్యం 5000 చదరపు అడుగులు ఉంటుంది. అలాగే ఇందులో చూపరులను కట్టిపడేసే ఫంక్షన్ హాల్స్, మోతీ భాగ్ ప్యాలెస్, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం లాంటి ఇతర భవనాలు కూడా ఉన్నాయి. ఈ ప్యాలెస్ అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రైవేట్ నివాసం భవనంగా పేరుగాంచింది. భవనాన్ని నిర్మించేటప్పుడే అన్ని సౌకర్యాలుండేలా ఎలివేటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్యాలెస్‌లో లిఫ్ట్‌లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే భవనం లోపల చూపు తిప్పుకోకుండా ఉండేలా యూరోపియన్ శైలిలో ఉండే ఎన్నో రకాల అలంకరణలను ఏర్పాటు చేశారు. 1930వ సంవత్సరంలో అప్పటి మహారాజు ప్రతాప్ సింగ్ యూరోపియన్ అతిథుల కోసం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఎదురుగా గోల్ఫ్ కోర్స్ నిర్మించాడు.
ప్రపంచంలోనే ఎక్కువ కిటికీలు..
ఈ ప్యాలెస్‌లో ఉన్న మహారాజా ఫతే సింగ్ మ్యూజియంలో రాజా రవివర్మకు సంబంధించిన అనేక అరుదైన పెయింటింగ్స్ ఉన్నాయి. అలాగే ఈ రాజభవనంలో ప్రపంచంలోని ఇతర ప్యాలెస్‌ల కంటే ఎక్కువ గాజు కిటికీలున్నాయట. వీటిలో ఎక్కువ గాజు కిటికీలను బెల్జియం నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను బరోడా రాజ కుటుంబం గైక్వాడ్ వంశస్థులైన హెచ్‌ఆర్‌హెచ్ సమర్జిత్ గైక్వాడ్, రాధికారాజేలు నిర్వహిస్తున్నారు. ఈ రాజప్రాసాదాన్ని నిర్మించడానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. ఇంతకీ ఈ అందమైన రాజభవనం విలువ ఎంత ఉంటుందో చెప్పలేదు కదూ.. దాదాపు రూ.24,000 కోట్లు ఉంటుందట.