National
Delhi Excise Policy Case : ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు
Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. రూ. 15వేలు బాండ్, లక్ష పూచీకత్తు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఫిర్యాదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు అయింది. దీంతో లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ఊరట లభించినట్లయింది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 1న ఉదయం 10గంటలకు జరగనుంది. అయితే, కేజ్రీవాల్ కు రెగ్యులర్ హాజరు నుండి రౌస్ అవెన్యూ కోర్టు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన దరఖాస్తును కూడా కోర్టు ఏప్రిల్ 1న విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణకు హాజరుకావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసిన విషయం విధితమే. కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు. దీంతో కేజ్రీవాల్ దర్యాప్తునకు హాజరు కాకపోవటంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో గత నెలలో ఈడీ ఫిర్యాదు చేసింది. దీంతో ఫిబ్రవరి 17న హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ సమయంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించుకున్నారు. ఇందుకు కోర్టు అంగీకరించి విచారణ వాయిదా వేసింది.
కోర్టులో ఈడీ విచారణ కేసు అంశం పెడింగ్ లో ఉండగా.. మార్చి 4న విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి సమన్లు ఇచ్చింది. కేజ్రీవాల్ ఈడీ విచారణకు గౌర్హాజరయ్యారు. అయితే, మార్చి 12న తరువాత వర్చువల్ గా విచారణకు హాజరవుతానని ఈడీకి సమాచారం ఇచ్చారు. ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. మార్చి 16వ తేదీన విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం కేజ్రీవాల్ కోర్టు ఎదుట హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కోర్టులో నమోదు చేసిన రెండు కేసుల్లోనూ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.