Andhrapradesh
ఏపీలో స్దానిక సంస్థలకు గుడ్ న్యూస్- మరో హామీ నెరవేర్చిన కూటమి సర్కార్..!
ఏపీలో స్థానిక సంస్థలకు కూటమి సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు లేక అల్లాడిన స్థానిక సంస్థలకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ స్థానిక సంస్థలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేస్తూ ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ తొలి సంతకం చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్నట్లయింది.
స్దానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధుల్ని గత వైసీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు తరచుగా మళ్లించింది. దీంతో స్థానిక సంస్థలు కనీస అవసరాలు తీర్చుకునేందుకు నిధుల్లేక అల్లాడాయి. దీనిపై సర్పంచ్ లు ఎన్నో పోరాటాలు చేసినా వైసీపీ సర్కార్ మాత్రం వారిని కరుణించలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు యథావిధిగా విడుదల చేస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ మేరకు ఇవాళ స్థానిక సంస్థలకు రూ.250 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధిక మంత్రి పయ్యావుల తొలి సంతకం చేశారు.
గతంలో 15వ ఆర్ధిక సంఘం నిధులు రాక స్థానిక సంస్థలు పూర్తిగా కుదేలయ్యాయి. కరెంటు బిల్లులు కూడా కట్టలేని స్థితికి చేరుకున్నాయి. దీంతో ఓ దశలో కోర్టుల్ని కూడా ఆశ్రయించాయి. అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీనిపై కేంద్రానికై సైతం ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఖాతాలు ఏర్పాటు చేసి మరీ నిధులు అందులో జమచేసింది. ఇలా ఐదేళ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్న స్థానిక సంస్థలకు ఇవాళ తొలిసారి నిధులు విడుదలయ్యాయి.