National

అమెరికాలో కలకలం… మరో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. ఎవరీ నితీషా కందుల

Published

on

అమెరికాలో వివిధ కారణాలతో భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, తెలుగు విద్యార్థిని అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన యువతి నితీషా కందుల (23) గత వారం రోజులుగా తప్పిపోయినట్టు అమెరికా పోలీసులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం గత శుక్రవారం రాత్రి నుంచి ఆమె అదృశ్యమైనట్లు పేర్కొన్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ- శాన్‌బెర్నార్డినో విద్యార్ధిని అయిన నితీషా మే 30న చివరిసారిగా లాస్ ఏంజెల్స్‌లో కనిపించినట్టు పోలీస్ అధికారి జాన్ గుట్టైరెజ్ వెల్లడించారు.

కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతోన్న నితీషా కందుల శుక్రవారం రాత్రి నుంచి జాడలేదు. ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో స్నేహితులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత్‌లోని నితీషా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో సాయం కోసం వాట్సాప్‌ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు. అదృశ్యమైన నితీషా కనిపిస్తే +91 80749 62618 నంబర్‌కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

అటు, పోలీసులు సైతం ఎక్స్‌లో ఆమె కోసం ప్రకటన చేశారు.‘నితీషా కందుల ఆచూకీ తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి.. ఆమె 5.6 ఆడుగుల ఎత్తు, దాదాపు 73 కిలోల బరువు ఉంటుంది.. కళ్లు, జుట్టు నల్లగా ఉంటాయి.. కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్‌తో 2021 మోడల్ టయోటా కొరల్లా వాహనం ఆమె నడిపినట్టు తెలుస్తోంది.. ఆమెకు సంబంధించిన సమాచారం తెలిస్తే (909) 537-5165 నెంబరుకు తెలియజేయండి’ అని ట్వీట్ చేశారు.

గత నెలలో షికాగోలో తెలుగు విద్యార్ధి రూపేశ్ చంద్ర చింతకింది అదృశ్యమైన విషయం తెలిసిందే. అంతకు ముందు మార్చి నుంచి కనిపించకుండా పోయిన క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతోన్న హైదరాబాద్ యువకుడు మహ్మద్ అబ్దుల్ అరాఫత్.. ఏప్రిల్‌లో శవమై కనిపించాడు. దీనికి ముందు భారత్‌కు చెందిన సంప్రదాయ నాట్య శిక్షకురాలు అమర్‌నాథ్ ఘోష్‌ను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌తో దారుణ హత్యకు గురయ్యారు. పర్ద్యూ యూనివర్సిటీలో చదువుతోన్న భారతీయ అమెరికన్ సమీర్ కామంత్‌ ఫిబ్రవరి 5న ఇండియానాలో అనుమానాస్పదంగా మృతిచెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version