Andhrapradesh
Heatwave Alert : మరో 3 రోజులు జాగ్రత్త, ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం వార్నింగ్
Heatwave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. భానుడు భగభగ మండిపోతున్నాడు. మాడు పగిలే రేంజ్ లో ఎండలు విజృంభిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తెలంగాణలో మరో 3, 4 రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.
తెలంగాణలో మరో 3 రోజులు వడగాల్పులు..
రానున్న రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ(ఏప్రిల్ 17) కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో అక్కడ వడగాలులు వీచాయి. ఇక రేపు(ఏప్రిల్ 18) ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి(ఏప్రిల్ 19) ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో వడగాలులు వీస్తాయంది. అలాగే ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందంది.
రానున్న 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు..
పెరుగుతున్న పగటి పూట ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. తెలంగాణలో 70శాతం ప్రాంతాలలో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఉత్తర తెలంగాణలో 42 నుంచి 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి.
నిప్పుల కొలిమిలా ఏపీ..
ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏపీలో 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.