International

హమాస్‌ మాస్టర్‌మైండ్ డెయిఫ్‌ హతం.. వరుసపెట్టి హమాస్ లీడర్లను ఖతం చేస్తున్న ఇజ్రాయెల్

Published

on

Hamas military chief Mohammed Deif : ఏళ్లనాటి దుష్మనీ. అలాగని, పోనీలే అని వదిలేసే పరిస్థితి లేదు. ఓ గాయాన్ని మర్చిపోకముందే మరో గాయం తాకుతుంది. ఇది నేరుగా అయ్యే గాయం కాదు.. గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారిన దాడి చేసి వందల ప్రాణాలు తీస్తోంది. ఈ వరుస ఘటనలతో హమాస్ మీద ప్రతీకారంతో రగిలిపోతోంది ఇజ్రాయెల్. ఇంకేముంది మొసాద్‌ ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ దెబ్బ ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రాణనష్టం, ఆకృత్యాలను భరించినా.. హమాస్ రెచ్చిపోతుండటంతో ఇజ్రాయెల్.. పగబట్టి.. అదును చూసి.. వెంటాడి.. వేటాడి హమాస్‌ను దెబ్బ కొడుతోంది. ఒక్కొక్కరుగా హమాస్ లీడర్లను ఖతం చేస్తూ వస్తోంది. మొసాద్ దెబ్బ హమాస్ అబ్బా అన్నట్లుగా మారింది సీన్. యుద్ధం అంటూ చేస్తే విజయమో, వీరమరణమో.. ఏదో ఒకటి సాధించాలన్నట్లుగా.. దొంగదెబ్బలతో జరిగిన నష్టంపై రగిలిపోతోన్న ఇజ్రాయెల్‌.. ఇప్పుడు టాప్‌గేర్‌లో అటాక్ స్టార్ట్ చేసింది.

హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌ పైచేయి సాధిస్తోంది. గతేడాది అక్టోబరు 7 నాటి మెరుపుదాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న హమాస్‌ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్‌ డెయిఫ్‌ను ఖతం చేసింది. గాజాలోని ఖాన్‌ యూనిస్‌ ఏరియాలో జులై 13న జరిపిన దాడుల్లో అతడు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే కొన్నిసార్లు ఇజ్రాయెల్ సైన్యానికి చిక్కినట్లే చిక్కి చేజారిపోగా.. డెయిఫ్‌ లక్ష్యంగా గాజాలో చేసిన అటాక్‌తో అతడు చనిపోయినట్లు చెబుతోంది ఇజ్రాయెల్.

ఎవరీ డెయిఫ్‌?
గాజాలోని ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలో 1965లో డెయిఫ్‌ జన్మించాడు. పూర్తి పేరు మహమ్మద్‌ డియాబ్‌ ఇబ్రహీం అల్‌ మస్రీ. 1980చివర్లో హమాస్‌లో చేరాడు. ఆ తర్వాత హమాస్‌లో అంచెలంచెలుగా ఎదిగాడు. అతడు ఎక్కడ పెరిగాడు.. ఏం చదువుకున్నాడో ఎవరికీ తెలియదు. డెయిఫ్ వ్యూహాలు, దాడులు కూడా పక్కన ఉన్నవాళ్లకు కూడా అంతుచిక్కవు. అలా హమాస్‌ బాంబుల తయారీ నిపుణుడు అయ్యాష్‌కు దగ్గరయ్యాడు. అయ్యాష్‌ గతంలో ఇజ్రాయెల్‌ దళాలపై బాంబుదాడులు చేశాడు. అతడు ఇజ్రాయెల్‌ దళాల చేతిలో హతమయ్యాక.. 2002లో హమాస్‌లోని మిలిటరీ వింగ్‌ హెడ్ అయ్యాడు డెయిఫ్‌. హమాస్‌ వాడే కస్సాం రాకెట్ల తయారీ వెనుక కీలక పాత్ర పోషించాడు. ఇజ్రాయెల్‌ దళాలను ముప్పుతిప్పలు పెట్టిన గాజా టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మాణం వెనుక మాస్టర్‌ మైండ్‌ కూడా అతడే. ఇజ్రాయెల్‌ దళాలకు చిక్కకుండా డెయిఫ్ ఎక్కువ సమయం ఆ సొరంగాల్లోనే గడుపుతాడని నిఘా వర్గాల అంచనా.

ఈసారి మొసాద్ టార్గెట్ మిస్ కాలేదు!
ఇంత యుద్ధం జరుగుతోన్న ఇజ్రాయెల్ దళాలకు చిక్కకుండా తిరిగాడు డెయిఫ్. మొసాద్ నిఘాను మాత్రం దాటలేకపోయాడు. అడ్వాన్‌డ్ కమ్యూనికేషన్‌, రాడార్ సిస్టమ్‌కు చిక్కకుండా తిరగడంతో డెయిఫ్‌ను గుర్తించడం ఇజ్రాయెల్‌కు సాధ్యం కాలేదు. కానీ ఈసారి మొసాద్ టార్గెట్ మిస్ కాలేదు. ఏడుసార్లు చేసిన దాడలు నుంచి తప్పించుకున్న డెయిఫ్ ఎనిమిదోసారి జరిగిన అటాక్‌లో చనిపోయినట్లు తెలుస్తోంది. 2000లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన డెయిఫ్‌కు.. ఆ సమయంలో ఒక కన్ను పోవడంతో పాటు కొన్ని అవయవాలు దెబ్బతిన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియాను ఇజ్రాయెల్‌ మట్టుబెట్టింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఇంటివద్ద జరిగిన దాడిలో హనియాతో పాటు అతని గన్‌మెన్ చనిపోయాడు. దీనిపై ఇరాన్ హైలెవల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. అయితే తమ దేశంలో ఉన్న హనియాను ఇజ్రాయెల్ చంపిందన్న అనుమానాలపై ఇరాన్ కౌంటర్‌ ఎటాక్‌కు రెడీ అవుతోంది. ఒకవేళ ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగితే అది ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇలా పశ్చిమాసియాలో రోజురోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోవైపు పాలస్తీనా యుద్ధం తర్వాత.. మిలిటెంట్లతో రంగంలోకి దిగిన హమాస్ టీమ్..ఇప్పుడు ఇజ్రాయెల్ చేతిలో కుక్కచావు చచ్చే పరిస్థితి తెచ్చుకుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version