International
Google Layoffs: గూగుల్ షాకింగ్ ప్రకటన.. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలో 5 వేల మంది అవుట్!
Google Jobcuts: దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ మళ్లీ ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో వెల్లడించారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారాయన. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల టెక్ రంగంలో ఎన్నో మార్పులొస్తున్నాయి. మన కోట్లాది మంది కస్టమర్లకు మెరుగైన ప్రొడక్ట్స్ అందించేందుకు ఇది మంచి అవకాశం. ఈ క్రమంలో కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. మన ప్రాధాన్యాలు ఏంటో గుర్తించి.. వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా నైపుణ్యం ఉన్న కొందరు సభ్యుల్ని బయటకు పంపాల్సి వస్తోంది. ఇది అత్యంత క్లిష్టమైన విషయం అని మాకు తెలుసు.’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో ఈ విషయం తెలిపారు సీఎఫ్ఓ.
2024లో మరికొంత మంది ఉద్యోగుల్ని తొలగిస్తామని కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ గతంలోనే వెల్లడించారు. అప్పుడు కూడా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించగా.. ఈ సారి ఆ సంఖ్య ఎంత అనే దానిపై క్లారిటీ లేదు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొంత మంది ఉద్యోగుల్ని గూగుల్ ఇతర విధుల్లోకి కూడా బదిలీ చేస్తోంది.
భారత్‌లో కార్యకలాపాల్ని విస్తరిస్తున్న ఆ సంస్థ.. కొందరిని ఇక్కడకు కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎంత మందిని తొలగిస్తున్నారు. ఎందరిని బదిలీ చేస్తున్నారనే విషయం గురించి కంపెనీ బహిర్గతం చేయలేదు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెక్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. యాపిల్, టెస్లా, అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా సిబ్బందిని తగ్గిస్తున్నాయి. 2024లో వీటిల్లో ఇప్పటి వరకు 58 వేల మంది వరకు ఉద్వాసనకు గురైనట్లు పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
>> మరోవైపు జపాన్‌కు చెందిన పెద్ద కంపెనీ తోషిబా కూడా ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. నిక్కీ రిపోర్ట్ ప్రకారం.. దాదాపు 5 వేల మందిని తొలగించనుంది తోషిబా. కంపెనీ సిబ్బందిలో ఇది మొత్తం 10 శాతానికి సమానం. డిజిటల్ టెక్, ఇన్‌ఫ్రా వంటి పలు కీలక రంగాలపై దృష్టి సారించడంలో భాగంగానే.. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్ని అమలు చేస్తోంది. తోషిబాను ఇటీవల ఆర్థిక కష్టాలు వెంటాడాయి. అవినీతి ఆరోపణలు, నిర్వహణ లోపాలు వచ్చాయి. మెమొరీ చిప్ వ్యాపారాన్ని కూడా విక్రయించింది.