Andhrapradesh
Andhra Pradesh: ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సచివాలయాలకు వెళ్లే పని లేదు
ఏపీలో పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఈ మండే ఎండల్లో పింఛన్ల కోసం మీరు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవును.. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక బ్యాంక్ అకౌంట్ లేనివారికి, దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దకు వచ్చే పించన్లు ఇవ్వనున్నారు. వీరికి మే 1 నుంచి 5వ తేదీ లోపు ఇళ్లకు వచ్చి.. సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇస్తారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో విధివిధానాల్లో ఈ మేరకు మార్పులు చేసింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 66 లక్షల మంది వివిధ సామాజిక పింఛన్లు పొందుతున్నారు. మార్చి వరకు ప్రతి నెలా ఒకటో తేదిన వాలంటీర్లు ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. అయితే, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ తప్పించింది. దీంతో ఏప్రిల్ 1న లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలని గవర్నమెంట్ సూచించింది. దీంతో పలువురు వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. కొందరు ఎండదెబ్బకు గురయ్యారు. దీంతో ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా చూడాలని ఈసీ మరోసారి ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో వేయాలని సూచించారు.