National
గేమ్‌జోన్‌లో ఫైర్ సేఫ్టీపై అనేక సందేహాలు! ఈ దుర్ఘటన మానవ తప్పిదమే అంటూ హైకోర్టు సీరియస్ – Gujarat Game Zone Fire Accident
Gujarat Game Zone Fire Accident Probe : గుజరాత్ రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య 30కి చేరింది. అందులో దాదాపు 12మంది చిన్నారులు ఉన్నారు. వేసవి సెలవులు, అందులోనూ వారాంతం, సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు పెద్దసంఖ్యలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు వస్తారని తెలిసినప్పటికీ అనుకోని ఘటన జరిగినప్పుడు వారి రక్షణ చర్యలను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుండగా తాత్కాలిక నిర్మాణమైన గేమ్ జోన్ పైకప్పు కూలిపోవడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
ఆరుగురిపై ఎఫ్ఐఆర్, ఇద్దరు అరెస్ట్
ఈ ప్రమాదానికి సంబంధించి టీఆర్‌పీ గేమింగ్ జోన్ పార్టనర్లు అయిన ఆరుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అనుమతులు తీసుకోలేదు!
గేమ్ జోన్ నిర్వాహకులు అవసరమైన అనుమతులు తీసుకోలేదని ప్రభుత్వవర్గాల ద్వారా తెలుస్తోంది. రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అగ్నిమాపక విభాగం నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోలేదని మేయర్ నయినా పెదాడియా చెప్పారు. ఈ క్రమంలోనే భద్రతాపరమైన ఏర్పాట్లు కొరవడి, ప్రమాదానికి దారి తీసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అగ్నిమాపక విభాగం NOC లేకుండా ఇంత పెద్ద గేమ్ జోన్ ఎలా నడుపుతున్నారనే అంశంపై దర్యాప్తు జరిపిస్తామని మేయర్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బయటకు వెళ్లేందుకు ఒకే మార్గం ఉండడం, అది కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేయడం వల్ల గేమ్ జోన్‌లోని వారు ఆందోళనకు గురయ్యారని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.
పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ
ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం స్థానిక నగరపాలక సంస్థ సిబ్బందితో సమావేశమై వివరాలు సేకరించింది. ప్రమాదానికి కారకులను గుర్తిస్తామని చెప్పిన సిట్ అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ ఉదయం ప్రమాద స్థలిని పరిశీలించిన సీఎం భూపేంద్ర పటేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు 4లక్షలు చొప్పున, గాయపడినవారికి 50వేలు చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు చొప్పున, గాయపడినవారికి 50వేలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.
గుజరాత్‌లోని అన్ని గేమింగ్ జోన్లను పరిశీలించి, భద్రతా ప్రమాణాలపై ఆరా తీయాలని DGP పోలీసు అధికారులను ఆదేశించారు. అనుమతుల్లేని వాటిని తక్షణమే మూసివేయాలని హెచ్చరించారు.
ఈ ప్రమాదం మానవ తప్పిదమే : హైకోర్టు
రాజ్‌కోట్ దుర్ఘటన మానవతప్పిదంగానే ప్రాథమికంగా కనిపిస్తోందని అభిప్రాయపడిన గుజరాత్ హైకోర్టు దీనిపై సోమవారం సుమోటోగా విచారణ చేపడతామని ప్రకటించింది. గేమ్ జోన్లు, రిక్రియేషన్ క్లబ్‌లు అనుమతులు లేకుండానే నడుస్తున్నాయన్న హైకోర్టు అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్ నగరపాలక సంస్థల తరఫు న్యాయవాదులు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గేమ్ జోన్లు, క్లబ్‌ల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇస్తున్నారు, ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారో తమకు వివరించాలని స్పష్టం చేసింది.