International
మిత్రదేశంగా ఉండే మాల్దీవులు ఇప్పుడు భారత వ్యతిరేక కూటమిలో భాగస్వామిగా..
చైనా మొదట అభివృద్ధిని ఎరగా వేస్తుంది…. చెప్పే మాటలు వినేలా ప్రలోభపెడుతుంది… అప్పులు ఇచ్చి ఆకట్టుకుంటుంది. వడ్డీల భారంతో కుదేలు చేస్తుంది. చివరకు తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటుంది. ఒకప్పుడు మనకు మిత్రదేశంగా ఉండే శ్రీలంకనయినా… శత్రుదేశంగా ఉండే పాకిస్థాన్‌తో అయినా చైనా అనుసరించిన నీతి ఇదే..
తెలిసీ తెలియక శ్రీలంక ఆ ఉచ్చులో చిక్కుకుంటే.. పొరుగుదేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా… మాల్దీవులు కళ్లున్న గుడ్డిదానిలా మారి డ్రాగన్ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతోంది. అధ్యక్షుల విధానాల అవకతవకలు దేశానికి, ప్రజలకు ఏ గతిని పట్టిస్తాయనేదానికి రానున్న రోజుల్లో మాల్దీవులు నిదర్శనంగా మారనుంది.
భారత సైనికులెవరూ ఉండబోరంటూ..
మే 10 తర్వాత యూనిఫాంలో కానీ, సాధారణ దుస్తుల్లో కానీ భారత సైనికులెవరూ మాల్దీవుల్లో ఉండబోరంటూ ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు చెప్పిన మాటల వెనక చైనా ఉందన్న సంగతి అందరికీ తెలుసు. విడతలవారీగా మాల్దీవుల్లో బలగాలను భారత్ ఉపసంహరించుకుంటోంది. ఇదే సమయంలో మాల్దీవుల విదేశాంగ విధానం అత్యంత వేగంగా చైనాకు అనుకూలంగా మారిపోతోంది.
భారత్‌కు అనుంగు మిత్రదేశంగా ఉండే మాల్దీవులు ఇప్పుడు మన వ్యతిరేక కూటమిలో భాగస్వామిగా మారేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మాల్దీవులను ఈ దిశగా మళ్లించే ప్రయత్నాలు చైనా ఎప్పుడో మొదలుపెట్టింది. కొన్నేళ్లగా మాల్దీవులకు చైనా లక్షలకోట్ల రుణాలు అందిస్తోంది. ఆర్థిక, నిర్మాణ రంగాలకు భారీగా అప్పులు ఇచ్చి…మాల్దీవులను కీలుబొమ్మగా మార్చుకునేందుకు అన్ని అవకాశాలూ ఉపయోగించుకుంది.
ఈ వారం ప్రారంభంలో చైనా, మాల్దీవుల మధ్య సైనిక ఒప్పందం కూడా కుదిరింది. మాల్దీవుల రక్షణ శాఖ ఎలాంటి వివరాలూ తెలియజేయనప్పటికీ…అధునాతన ఆయుధాలను చైనా అందించనుందని ప్రచారం జరుగుతోంది. అలాగే గతంలో తమ సైన్యానికి భారత్, అమెరికాతో శిక్షణ ఇప్పించుకునే మాల్దీవులు ఇప్పుడు చైనాతో ఆ ఒప్పందం కుదుర్చుకుంది. ఐతే చైనాతో మాల్దీవులు కుదుర్చుకున్న ఆ రక్షణ ఒప్పందం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం.
డ్రోన్ల కొనుగోలు
చైనాతో ఒప్పందం తర్వాత టర్కీ నుంచి మాల్దీవులు డ్రోన్లు కొనుగోలు చేస్తున్న వ్యవహారం బయటకు వచ్చింది. ఐతే ఎన్ని డ్రోన్లు కొనుగోలు చేసిందో చెప్పలేదు కానీ వచ్చేవారం నుంచి ఈ డ్రోన్లతో సముద్రతీరంలో గస్తీ కాస్తామని తెలిపింది. మహ్మద్ మయిజ్జు మాల్దీవులు అధ్యక్షుడయిన తర్వాత ఆయన తొలిగా పర్యటించింది టర్కీలోనే. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనాలో పర్యటించారు.
దేశంలో తీవ్ర ప్రతికూలత ఎదురయినా మయిజ్జు తన మొండి వైఖరి విడిచిపెట్టడం లేదు. గతంలో మాల్దీవుల అధ్యక్షులు ఇండియా ఫస్ట్ అన్న విధానంతో ఉండేవారు. మయిజ్జు మాత్రం మాల్దీవులు ఫస్ట్ అన్న విధానం ముసుగులో చైనా ఫస్ట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏ కారణం చేతనో ఎన్నికల ప్రచారంలోనే భారత్ వ్యతిరేకతను బయటపెట్టిన మయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వివాదాస్పద వ్యవహారశైలిని కొనసాగిస్తున్నారు.
చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత మయిజ్జు వైఖరిలో మార్పు రాలేదు. తమది చిన్నదేశం అయినంత మాత్రాన తమను బెదిరించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. తమది చిన్న ద్వీపాల సమూహమే అయినా..దాదాపు 9లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఎకనామిక్ జోన్ ఉందని మయిజ్జు చెబుతున్న మాటలు భారత్‌ను ఉద్దేశించినవే.
అయితే మయిజ్జు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే..భారత్‌తో శత్రుత్వం ఆ దేశానికి ఏ మాత్రం మంచిది కాదని. పర్యాటకమే ప్రధాన ఆదాయవనరు అయిన మాల్దీవులకు ఇప్పటికే భారత్ బాయ్‌కాట్ విధానంతో అపారనష్టం కలిగింది. పర్యాటకమే కాదు.. అసలు మాల్దీవుల మనుగడకే భారత్ ఆధారం అని చెప్పొచ్చు.
దిగుమతులు కీలకం
ఔషధాలు, ఆహారం, నిర్మాణరంగం ఇలా అన్ని రంగాలకు భారత్ నుంచి వచ్చే దిగుమతులు కీలకం. కరోనా వ్యాక్సిన్లను మాల్దీవులకు ఎక్కువగా అందించిన దేశం కూడా భారతే. ప్రస్తుతం పర్యాటకం మినహా మిగిలిన విషయాల్లో భారత్ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. అలా కాకుండా భారత్ కఠిన చర్యలకు దిగితే మాల్దీవుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.
చైనా సైనిక ఒప్పందాలు, ఆయుధాల అందజేత, అభివృద్ధి పేరుతో ఇచ్చే అప్పులు శ్రీలంకను దివాళా తీయించాయి. పాకిస్థాన్ అదే దారిలో ఉంది. అనేక దేశాలు ఇలాగే చైనా చేతిలో చిక్కుకుపోయి విలవిల్లాడుతున్నాయి. వాటినుంచి పాఠాలు నేర్చుకోకుండా మహ్మద్ మయిజ్జు చైనాతో అంటకాగుతుండడంపై దేశంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మరోవైపు మాల్దీవులకు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమయింది. హిందూమహాసముద్రంలో పట్టు పెంచుకునేందుకు లక్షద్వీప్‌లో జటాయు పేరుతో కొత్త నావికా స్థావరాన్ని ఏర్పాటుచేసింది. లక్షద్వీప్‌లోని మినికాయ్‌లో INS జటాయు పేరుతో ఏర్పాటు చేసిన ఈ బేస్ సముద్ర దొంగలు, డ్రగ్స్ రవాణా నియంత్రణ కార్యకలాపాలకు వేదికగా ఉంటుందని ఇండియన్ నేవీ తెలిపింది. రక్షణ పరంగా హిందూమహాసముద్రంలో భారత్‌కు మాల్దీవులు అత్యంత కీలకం.
మాల్దీవులు తోకజాడిస్తే..
అదే సమయంలో మాల్దీవులు తోకజాడిస్తే.. ఆ దేశానికి చెక్ పెట్టేందుకు భారత్ దగ్గర ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. కానీ డ్రాగన్ విషకౌగిలిలో ఒక్కసారి చిక్కుకున్న తర్వాత బయటపడే మార్గమే మాల్దీవులకు ఉండదు. అప్పులకు వడ్డీలు కట్టలేక దేశం ఆస్తులను వరుసగా చైనాకు ధారాధత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
చివరకు ఇష్ఠం లేకపోయినా చైనా చెప్పినట్టల్లా ఆడాల్సిన అగత్యం కలుగుతుంది. వ్యక్తిగత స్వార్థం కోసమో, మరే కారణం చేతనో… దేశాన్ని చేతులారా అలాంటి స్థితిలోకి, దివాళా దుస్థితిలోకి నెట్టివేస్తున్న అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ఇకనైనా హితులు, సన్నిహితుల మాటలు పెడచెవిన పెట్టకుండా తన వైఖరి మార్చుకుంటే మంచిది.