National

శుక్రవారం ‘ఖలిస్థానీ వేర్పాటువాది’ అమృత్​పాల్​ ప్రమాణ స్వీకారం – నేరుగా జైలు నుంచి పార్లమెంట్​కు! – Khalistani Separatist AmritpalSingh

Published

on

Khalistani Separatist Amritpal Singh To Take Oath As MP : ఖలిస్థానీ వేర్పాటువాది, వారిస్‌ పంజాబ్‌ దే అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని ఫరీద్‌కోట్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ సరబ్‌జీత్ సింగ్ ఖల్సా తెలిపారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి అసోంలోని డిబ్రూగఢ్‌ జైలులో ఉన్న అమృత్‌పాల్‌కు ప్రమాణ స్వీకారం కోసం వివిధ శాఖల నుంచి అనుమతి వచ్చినట్టు ఆయన వెల్లడించారు.

పెరోల్​పై విడుదల
అమృత్‌ పాల్ ప్రమాణ స్వీకారం గురించి స్పీకర్‌ ఓం బిర్లాతో చర్చించేందుకు సరబ్​జీత్​ సింగ్​ దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. సమావేశం అనంతరం మాట్లాడిన సరబ్‌జీత్ సింగ్ ఖల్సా, ఈ శుక్రవారం అమృత్‌ పాల్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని చెప్పారు. దీనికి సంబంధించి అమృత్‌పాల్‌కు ఐదవ తేదీ నుంచి నాలుగురోజుల పాటు పేరోల్‌ లభించినట్లు తెలిపారు.

ఉగ్ర నేపథ్యం ఉన్నా!
అమృత్‌ పాల్‌ పంజాబ్​లోని ఖడూర్‌ సాహిబ్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన కుల్బీర్ సింగ్ జిరాపై ఆయన లక్షా 97 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అమృత్‌పాల్ సింగ్‌తో పాటు ఉగ్రనిధుల కేసు నిందితుడు, బారాముల్లా ఎంపీ ఇంజినీర్‌ రషీద్‌ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.

పోలీస్​ స్టేషన్​పై దాడి
గతేడాది పంజాబ్‌ అమృత్‌సర్‌ జిల్లా అజ్‌నాలా పోలీస్‌ స్టేషన్‌పై దాడి కేసులో అమృత్‌పాల్‌ పేరు దేశంలో మార్మోగింది. తన అనుచరుడు లవ్‌ప్రీత్‌ను స్టేషన్ నుంచి విడిపించేందుకు వందలాది మంది మద్ధతుదారులతో కలిసి అమృత్‌పాల్ విధ్వంసం సృష్టించారు. కత్తులు, తుపాకులతో అజ్‌నాలా పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లి బారీకేడ్లను తొలగించారు. అప్పుడు జరిగిన ఘర్షణల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అమృత్‌పాల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అమృత్‌పాల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా తన మద్ధతుదారుల సాయంతో దాదాపు నెల రోజుల పాటు తప్పించుకుని తిరిగాడు. చివరికి జర్నైల్‌ సింగ్‌ గ్రామమైన రోడెలోని గురుద్వారాలో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు. మరో తొమ్మిది మంది అమృత్‌పాల్‌ అనుచరులను కూడా అదే జైలుకు పంపారు.

తనకు తానే నాయకుడిగా!
వారిస్ పంజాబ్‌ దే సంస్థ వ్యవస్థాపకుడు దీప్‌సిద్ధూ మరణించిన తరువాత, అమృత్‌పాల్‌ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నారు. నాటి నుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్‌నే స్థావరంగా ఎంచుకున్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version