International
యూఏఈలో వరదలు.. నీట మునిగిన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
Dubai Floods: అధిక ఉష్ణోగ్రతలు, డ్రై అట్మాస్పియర్‌తో అట్టుడికిపోయే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వరదల బారిన పడింది. భారీ వర్షాల ధాటికి వరదల్లో చిక్కుకుంది. ఊహించని జలప్రళయం దుబాయ్ నగరాన్ని స్తంభింపజేసింది. దీంతో దుబాయ్ వాసులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణ మార్పుల యొక్క వ్యతిరేక ప్రభావం వల్లే దుబాయ్ లో వరదలు వచ్చాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నీట మునడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా విమాన కార్యకలాపాలు ప్రమాదకరంగా మారడంతో అనేక ఇన్‌కమింగ్ విమానాలను మళ్లించాల్సి వచ్చింది. 100కి పైగా విమాన రాకపోకలను అంతరాయం కలిగింది. పలు విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
నీట మునిగిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వరదలతో నిండిన రన్‌వేలపై వెళుతున్న విమానాలు, విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో సగం మునిగిపోయిన కార్లు వీడియోల్లో కనిపించాయి. విమానాశ్రయానికి వెళ్లే యాక్సెస్ రోడ్లు కూడా ముంపునకు గురైంది. దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ వంటి ఫ్లాగ్‌షిప్ షాపింగ్ సెంటర్‌లతో సహా నగరంలోని కీలకమైన ప్రాంతాలు కూడా నీట మునిగాయి. దుబాయ్ మెట్రో స్టేషన్ కూడా మోకాల్లోతు నీటిలో ముగినిపోయింది. రహదారులు, నివాస సముదాయాలు కూడా వరద ప్రభావానికి గురయ్యాయి.
బహ్రెయిన్‌లోనూ వరదలు
తుఫాను ప్రభావంతో మొత్తం UAEలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎమిరేట్స్ అంతటా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించారు. UAE పొరుగున ఉన్న బహ్రెయిన్‌లోనూ వరదలు సంభవించాయి. దీంతో అక్కడ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా తుఫాను ప్రభావానికి గురైన ఒమన్‌లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఆకస్మిక వరదల కారణంగా పిల్లలతో సహా 18 మంది మరణించారు. బహ్రెయిన్ కూడా వరదల బారిన పడింది.