International
ఇక నుంచి వారికి వారంలో ఐదు రోజులు కాదు.. ఆరు రోజులు పనిదినాలు
సాధారణంగా కొన్ని సంస్థల్లో ఉద్యోగుల పనిదినాలు ఆరు రోజులు ఉంటాయి. మరికొన్నింటిలో ఐదు రోజులుంటాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంటుంది. ఐటీ కంపెనీల్లో శని, ఆదివారాలు సెలవులుంటాయి. ఐటీ ఉద్యోగులు ఐదు రోజులు మాత్రమే పనిచేస్తారు. బ్యాంక్ సెక్టార్ లో కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే ఓ కంపెనీ వర్కింగ్ డేస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పనివిధానానికి స్వస్థి పలికింది. ఇక నుంచి వారు వారంలో ఆరు రోజులు పని చేయాల్సిందేనట. ఇంతకీ ఆ కంపెనీ ఏంటీ? ఎందుకు అలా నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు మీకోసం..
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శాంసంగ్ ఉద్యోగుల పనిదినాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. వారం పనిదినాల్లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఐదు రోజులు ఉన్న పని విధానాన్ని ఆరు రోజులకు మార్చింది. శామ్‌సంగ్ గ్రూప్ దాని ఎగ్జిక్యూటివ్‌ల కోసం కఠినమైన ఆరు రోజుల పని షెడ్యూల్‌ను ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో ఆరు రోజుల పనివిధానం అమలు ప్రారంభమైంది. దక్షిణ కొరియాలో ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతున్న వేళ శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకుంది.
చమురు ధరలు పెరగడం, రుణ భారం అధికమవడం, దక్షిణ కొరియా కరెన్సీ వోన్ విలువ గణనీయంగా తగ్గడం వంటి అంశాలు శాంసంగ్ నివేదికలో “అత్యవసర మోడ్”గా వర్ణించిన ఈ నిర్ణయానికి కారణాలుగా తెలుస్తోంది. శాంసంగ్ నిర్ణయంతో ఉద్యోగులు శనివారం లేదా ఆదివారం ఏదో ఒక రోజు ఎంచుకోని పనిచేయాల్సి ఉంటుంది. కంపెనీకి చెందిన చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే వారానికి 6 రోజులు ఇష్టపూర్వకంగా పని చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి కంటే దిగువన ఉన్న ఉద్యోగులు వారంలో 5 రోజులు పని చేయనున్నారు.