National

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

Published

on

ఏసీ యూనిట్లో మంటలు చెలరేగడంతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిరిండియా విమానం 807 కోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాయంత్రం 5:52 గంటలకు పూర్తి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానం సాయంత్రం 6.38 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ లో మంటలు చెలరేగడంతో ఈ సమస్య తలెత్తింది.

ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తుండగా..
శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఏఐ807 ఎయిరిండియా విమానం ఆక్సిలరీ పవర్ యూనిట్ నుంచి ఫైర్ వార్నింగ్ రావడంతో.. విమానాన్ని అత్యవసరంగా తిరిగి ఢిల్లీకి తీసుకువచ్చారని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. పైలట్లు అవసరమైన ప్రోటోకాల్స్ ను ఉపయోగించిన తరువాత, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని వివరించారు. విమానంలోని ప్రయాణీకులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ఎయిరిండియా అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఏసీ యూనిట్లో మంటలు రావడంతో మళ్లీ తిరిగి ఢిల్లీకి అత్యవసరంగా తీసుకువచ్చారు. ఆ విమానంలోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వారికి పూర్తి రీఫండ్ లేదా, ఫ్లైట్ రీషెడ్యూల్ చేశామని ఎయిర్ ఇండియా (AIR INDIA) తెలిపింది. వీలైనంత త్వరగా వారు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ఫ్లైట్ రాడార్ 24లో లభించిన సమాచారం ప్రకారం ఇది ఏ321 విమానంగా తెలుస్తోంది.

ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ
ఆకాశంలో ఉండగా ఎయిర్ ఇండియా విమానంలోని ఏసీ యూనిట్ లో మంటలు వచ్చాయని, ఆ విమానాన్ని తిరిగి ఢిల్లీ ఏర్ పోర్ట్ కు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఢిల్లీ విమానాశ్రయంలో పూర్తి స్థాయి ఎమర్జెన్సీ ప్రకటించారు. మూడు అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచారు. ఆ సమయంలో ల్యాండింగ్ లేదా టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న ఇతర విమానాలను ప్రత్యామ్నాయ సూచనలు చేశారు. ‘‘అగ్నిప్రమాదం గురించి సాయంత్రం 6.15 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాకు ఫోన్ వచ్చింది. మూడు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించాం’ అని డీఎఫ్ఎస్ అధికారి తెలిపారు.

బాంబు బెదిరింపు కూడా..
దేశ రాజధానిలోని పలు ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఆదివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాయంత్రం 6.15 గంటలకు బాంబు బెదిరింపుకు సంబంధించి ఫోన్ వచ్చిందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ గార్గ్ తెలిపారు. ‘ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు గురించి మాకు సాయంత్రం 6.15 గంటలకు ఫోన్ వచ్చింది. అగ్నిమాపక యంత్రాలను ఘటనాస్థలికి తరలించాం’ అని గార్గ్ తెలిపారు.

Advertisement

అహ్మదాబాద్ లో కూడా..
ఢిల్లీ, అహ్మదాబాద్ లలో ఇటీవల ఇలాంటి బెదిరింపులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ-ఎన్సీఆర్ లోని 130కి పైగా పాఠశాలలకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులతో మెయిల్స్ వచ్చాయి. దాంతో, వెంటనే విద్యార్థులను తమ ఇళ్లకు పంపించారు. ఆయా విద్యా సంస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version