National
తుది దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం- బీజేపీ ‘400 పార్’కు బంగాల్ టెస్ట్! అందరి చూపు వారణాసిపైనే! – Lok Sabha Election 2024
Lok Sabha Polls Phase 7 polling : లోక్‌సభ ఎన్నికల ఏడోది, చివరివిడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. జూన్ 1న 8రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌లో 13 చొప్పున స్థానాలు ఉన్నాయి. బంగాల్‌లో 9, బిహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లోని ఒకచోట పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ సాయంత్రం 6గంటలకు ముగియనుంది. ఏడోవిడత ఎన్నికల బరిలో వివిధపార్టీల తరఫున 904మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పంజాబ్‌లో అత్యధికంగా 328మంది, ఆ తర్వాత వరుసగా యూపీలో 144 మంది, బిహార్ 134, ఒడిశా 66, ఝార్ఖండ్ 52, హిమాచల్ 37, చండీగఢ్‌లో 19మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
మోదీ నియోజకవర్గం ఎన్నికలు ఈ దశలోనే
ఏడువిడత లోకసభ ఎన్నికల్లో ముఖ్యంగా ఐదు స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి రెండుసార్లు విజయం సాధించిన మోదీ, ఇప్పుడు మూడోసారి జయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్ 2012లో బీజేపీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో సినీనటుల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ తరఫున భోజ్‌పురీ నటుడు రవికిషన్, నటి కాజల్ నిషాద్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి బరిలో నిలిచారు.
కింగ్ వర్సెస్ క్వీన్
అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి. అక్కడ రాజు, రాణి మధ్య పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటి, క్వీన్ కథానాయిక కంగనా రనౌత్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఆమె తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరఫున రాజకుటుంబానికి చెందిన విక్రమాదిత్యసింగ్ రంగంలో ఉన్నారు. ఆయన మాజీ సీఎం వీరభద్రసింగ్, హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభాదేవి సింగ్ దంపతుల కుమారుడు. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో కాంగ్రెస్ అభ్యర్థి సత్‌పాల్ సింగ్ రాయ్‌జాదా తలపడుతున్నారు. అనురాగ్ ఠాకూర్ ఇక్కడి నుంచి ఇప్పటివరకు వరుసగా 3సార్లు ఎంపీగా గెలుపొందారు.
బంగాల్‌లో అత్యధిక స్థానాలే బీజేపీ టార్గెట్
బంగాల్‌లోని డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. సీపీఎం నుంచి ప్రతికూర్ రహమాన్, బీజేపీ తరఫున అభిజిత్ దాస్ బరిలో ఉన్నారు. బంగాల్ ఎన్నికలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాల్లో గెలుపొందగా బీజేపీ 18 సీట్లు దక్కించుకుంది. ఈసారి బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందే రాష్ట్రాల్లో బంగాల్ మొదటి స్థానంలో ఉంటుందని కమలనాథులు చెప్పటం వల్ల ఉత్కంఠ నెలకొంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు MLAలు ఉన్న బీజేపీని 2021లో ప్రధాని మోదీ 77 స్థానాల్లో గెలిపించారని ఉదహరిస్తున్నారు.