National

Exit Poll 2024: ఎగ్జిట్ పోల్స్.. ప్రీ పోల్స్‌‌కు మధ్య డిఫరెన్స్ ఏంటి..?

Published

on

ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ లాగే ప్రీపోల్‌ సర్వేలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దేశంలో ప్రీ పోల్‌ సర్వేలను చాలా సంస్థలు నిర్వహిస్తుంటాయి. వీటి సంఖ్య ఇంత అని చెప్పటం సాధ్యం కాదు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రీపోల్‌ సర్వేలు ఎన్నికల్లో ఏ దశలోనైనా నిర్వహించవచ్చు. చట్టసభల గడువు ముగియక ముందు, ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందు, పొత్తులు ఉంటాయో లేదో తేలకముందు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకముందు, పార్టీలు, కూటములు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించకముందు, పోలింగ్‌ తేదీకి ఎంతో ముందు, లేదా దగ్గర పడిన సమయంలో కానీ ప్రీ పోల్‌ సర్వే నిర్వహించవచ్చు.

అయితే ప్రీ పోల్‌ సర్వే నిర్వహించే సమయానికి ఓటర్లలో అధిక భాగం ఇంకా ఏ నిర్ణయం తీసుకోక పోయి ఉండవచ్చు. లేదా సందిగ్ధంలో ఉండొచ్చు. లేదంటే అప్పుడు ఒపీనియన్‌ చెప్పిన వారు అసలు ఓటింగ్‌లో పాల్గొనకపోవచ్చు కూడా. ఈ పరిమితుల దృష్ట్యా ప్రీ పోల్‌ అంచనాను ఎవరూ విశ్వాసంలోకి తీసుకోరు. అదే ఎగ్జిట్‌ పోల్‌ అయితే.. పోలింగ్‌ జరిగిన రోజే చేపడతారు.

అందుకే ప్రీ పోల్‌తో పోలిస్తే ఎగ్జిట్‌ పోల్స్‌కు కచ్చితత్వం కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఎగ్జిట్‌ పోల్‌ అంచానాలు తుది ఫలితాలకు కనీసం 95 శాతం దగ్గరగా ఉంటే.. దాన్ని బట్టి ఆ సంస్థ ఎంత కచ్చితత్వమన్నది వెల్లడవుతుంది. కానీ చాలా సందర్భాల్లో తమ అంచనాలకు 60 శాతం దగ్గరగా ఫలితాలున్నా.. తాము విజయం సాధించినట్టు చాలా సంస్థలు ప్రకటించుకుంటుంటాయి.

పోలింగ్‌ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఏ సమయంలో ఎగ్జిట్‌ పోల్‌ నిర్వహించారు? ఎన్ని శాంపిల్స్‌ తీసుకున్నారు? అందులో ఎన్ని వర్గాల అభిప్రాయాన్ని సేకరించారు? ఇలాంటి అన్ని అంశాల ఆధారంగా ప్రీపోల్‌, ఎగ్జిట్‌ పోల్ పలితాలు ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తారు. అయితే ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను వాతావరణ శాఖ అంచనాలుగా కొంత మంది కొట్టి పారేస్తారు. ఎందుకంటే ఎగ్జిట్‌ పోల్స్‌కు విరుద్ధంగా కొన్ని సార్లు ఫలితాలు వెల్లడవుతుంటాయి. 2004లో ఇలాగే జరిగింది. ఆ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ వాజ్‌పేయ్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరిగింది.

ఎగ్జిట్‌ పోల్స్‌లో మార్జిన్‌ ఆఫ్‌ ఎర్రర్‌ ఎంత ఉంటుంది? అని నిపుణులను అడిగితే.. సాధారణంగా ఐదు శాతం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో మూడు శాతమని సమాధానమిస్తారు. అరుదుగా సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల్లో ఓటింగ్‌ శాతాలు, సీట్ల సంఖ్యలు వేర్వేరుగా ఉంటాయి. దీనికి స్థాఇక అంశాలు ప్రధాన కారణమన్న విశ్లేషణలున్నాయి. రెండు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్‌ శాతంలో స్వల్ప తేడా ఉంటే ఆ పార్టీలు సాధించే సీట్ల సంఖ్యను లెక్కకట్టటం చాలా కష్టమంటారు సర్వే నిర్వాహకులు. అందే ఓటింగ్‌ శాతంలో వ్యత్యాసం బాగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యు సులభంగా లెక్కించవచ్చంటారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version