International
Europe Volcano Puffs : యూరప్‌లో ఎట్నా అగ్నిపర్వతం వద్ద అద్భుత దృశ్యం.. ఆకాశంలోకి రింగులు రింగులుగా పొగలు కక్కుతోంది చూశారా?
Europe Volcano Puffs : యూరప్‌లోని అత్యంత చురుకైన అగ్నిపర్వతమైన మౌంట్ ఎట్నాలో నుంచి రింగులు రింగులుగా తిరుగుతూ పొగ బయటకు వస్తోంది. ఈ అద్భుతమైన దృశ్యం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అగ్నిపర్వతం నుంచి విడుదలైన వేడి నీటి బుడగలు వృతాకారంలో మారి ఆకాశంలోకి ఎగసిపడుతున్నాయి.
ఇలా ఎందుకు జరిగిందో శాస్త్రవేత్తలు పూర్తి వివరణ ఇచ్చారు. అగ్నిపర్వతంలో సుడి వలయాలుగా చెబుతున్నారు. ఎట్నా పర్వతం మీద ఒక కొత్త బిలం నుంచి వాయువుతో పాటు ఆవిరిని వేగంగా విడుదల చేయడం ద్వారా ఇలా ఆవిరి బుడగలు గాల్లోకి ఇలా ఎగసిపడుతున్నాయని అంటున్నారు.
ఇటాలియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్, వోల్కనాలజీ ఎట్నా అబ్జర్వేటరీలో అగ్నిపర్వత శాస్త్రవేత్త బోరిస్ బెన్కే ప్రకారం.. సాధారణంగా స్మోకింగ్ చేసేవారు పొగను వదిలినప్పుడు ఇలాంటి వలయాలు మాదిరిగా కనిపిస్తాయని వాషింగ్టన్ పోస్ట్‌తో అన్నారు. బెన్కే ప్రకారం.. అసాధారణ వలయాలు గతవారం మౌంట్ ఎట్నాపై ఒక కొత్త బిలం ఏర్పడిన తర్వాత అందులో నుంచి వెలువడే వాయువు కారణంగా బబ్లింగ్ మాదిరిగా బయటకు విరజిమ్ముతున్నాయని పేర్కొన్నారు.
రింగ్ ఆకారపు బుడగల్లో 80శాతం నీటి ఆవిరే :
ఇరుకైన స్థూపాకార వాహికలో లోతులో లావా ఉందని ఊహించుకోండని బెన్కే చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పొంగే లావా ఉపరితలం వద్ద బుడగలా ఏర్పడుతుంది. అది వెంటనే పగిలిపోతుంది. ఆ వాహిక ద్వారా అత్యంత వేగంతో వాయువును బయటకు నెట్టివేస్తుంది. అలా గ్యాస్ బుడగలు ఇరుకైన వృత్తాకార బిలం ద్వారా పైకి లేచినప్పుడు అదే ఆకారంలోకి మారి రింగ్-ఆకారపు బుడగలను సృష్టిస్తాయని ఆయన చెప్పారు.
ఈ అగ్ని బిలం నుంచి ఎగజిమ్మే గ్యాస్ రింగులు దాదాపు 80శాతం నీటి ఆవిరిని కలిగి ఉంటాయని, మిగిలినవి ఎక్కువగా సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఉంటాయని శాస్త్రవేత్త బెన్కే పేర్కొన్నారు. అందుకే నీటి ఆవిరి వల్ల ఆ బుడగలు తెల్లగా కనిపిస్తాయి. బిలం నుంచి వేగంగా బయటకు వచ్చి పొగ వలయాలు మాదిరిగా ఉబ్బుతాయని అన్నారు.
ఈ గ్యాస్ రింగుల వలయాలు దాదాపు 80శాతం నీటి ఆవిరి, మిగిలిన 20శాతం సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్‌తో నిండి ఉంటాయని తెలిపారు. చల్లని గాలిలో నీటి ఆవిరి వలయాలుగా ఏర్పడి తెల్లటి స్మోకీ రూపాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. అగ్ని పర్వతంలో నుంచి నీటి ఆవిరి ఉంగరాల మాదిరిగా బయటకు రావడం ఇదేమి అరుదైన దృగ్విషయం కాదన్నారు.