Andhrapradesh

Elephant Attack: కాడేద్దుల కోసం ప్రాణాలకు తెగించిన అన్నదాత.. ఏనుగుల దాడి నుండి సినీఫక్కీలో సేఫ్..!

Published

on

ఏనుగుల గుంపు భీభత్సంతో హడలెత్తి పోతున్నారు మన్యం వాసులు. గత కొన్నేళ్లుగా ఏజెన్సీవాసులను ముప్పుతిప్పలు పెడుతుంది ఏనుగుల గుంపు. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పెద్దఎత్తున ఘీంకారాలు చేస్తూ గ్రామాలపై పడుతున్నాయి ఏనుగులు. పంట నష్టంతోపాటు గ్రామాల్లోని పశువులపై దాడి చేస్తున్నాయి ఏనుగులు. పశువులసాలలను, పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి.

విజయనగరం జిల్లాలో గత కొన్నేళ్లుగా ఏనుగుల గుంపు రెచ్చిపోతుంది. నిత్యం ఏదో ఒక చోట పంట పొలాలు, రైతుల ఆస్తులు ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. ఏనుగుల దాడిలో ఇప్పటి వరకు పది మందికి పైగా మృత్యువాత పడగా, పదుల సంఖ్యలో స్థానికులు గాయాల పాలయ్యారు. మన్యం జిల్లాలో ప్రధానంగా కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో ఏనుగులు సంచరిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే గుండెల్లో వణుకు మొదలవుతుంది. రైతులు పంట పొలాలకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఏనుగుల గుంపు మరోసారి జియ్యమ్మవలస మండలం పెదకొదమలో రెచ్చిపోయాయి.

పెదకొదమకు చెందిన తిరుపతిరావు అనే రైతు తనకున్న నాటుబండినే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తన వద్ద ఉన్న నాటుబండితో పొలం పనులతో పాటు భవన నిర్మాణాలకు ఇసుక తరలిస్తూ బ్రతుకు బండి ఈడుస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఎప్పటిలాగే తన నివాసం నుండి ఇసుక కోసం వంశధార నదికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ప్రక్కనే ఉన్న పంట పొలాల నుండి ఆరు ఏనుగులు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చాయి. అప్పుడే సమీపంలో ఉన్న తిరుపతిరావు నాటుబండిని చూసిన ఏనుగులు పరుగుపరుగున బండి వద్దకు వచ్చాయి. ఏనుగుల గుంపు రెచ్చిపోయి ఘీంకారాలు చేస్తూ రావడం గమనించాడు తిరుపతిరావు. వెంటనే భయంతో పారిపోకుండా హుటాహుటిన బండిపై నుండి క్రిందకి దూకి బండి నుండి రెండు ఎద్దులను వేరు చేసే ప్రయత్నం చేశాడు.

అప్పటికే ఏనుగులు నాటుబండి పై దాడికి దిగాయి. అయినా సరే ఎలాగైనా ఎద్దులను కాపాడాలని ఏనుగులు బండిపై దాడి చేస్తున్నప్పటికీ సాహసోపేతంగా ప్రాణాలకు సైతం తెగించి ఎద్దులను వేరు చేసి వెంటనే ప్రక్కనే ఉన్న పంట పొలాల్లోకి పారిపోయాడు. మరోవైపు ఎద్దులు కూడా పరుగు లంకించి ప్రాణాలు కాపాడుకున్నాయి. అలా రైతు చాకచక్యంగా వ్యవహరించడంతో ఇటు రైతుతో పాటు అటు రెండు ఎద్దుల ప్రాణాలు కూడా నిలిచాయి. అయితే ఏనుగుల దాడిలో తన నాటుబండి మాత్రం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో జీవనాధారంగా ఉన్న నాటుబండి ధ్వంసం అవ్వడంతో లబోదిబోమని కన్నీరు పెట్టుకున్నాడు రైతు. ఇప్పటికైనా ఏనుగులను దూరప్రాంతాలకు తరలించి తమను కాపాడాలని కోరుతున్నారు జిల్లావాసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version