Weather
ఎల్ నినో ముగిసిపోతోంది.. శుభవార్త చెప్పిన ప్రపంచ వాతావరణ సంస్థ
తీవ్ర వర్షాభావ పరిస్థితులు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడించిన ‘ఎల్ నినో’ ముగిసిపోతున్నట్టు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకటించింది. దాని స్థానంలో జులై- సెప్టెంబరు మధ్య ‘లా నినా’ ఏర్పడటానికి అనుకూలంగా ఉందని తెలిపింది. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎల్ నినో దెబ్బకు ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. అత్యంత వేడి నెలగా ఏప్రిల్ రికార్డు సృష్టించిందని, దానికి ముందు 10 నెలల్లోనూ అదే పరిస్థితి ఉందని డబ్ల్యూఎంవో పేర్కొంది. ఎల్ నినో కారణంగా గత 13 నెలల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో వేడెక్కాయని వివరించింది.
మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కడంతోనే ఈ పరిస్థితి నెలకుంటుందని, అలాగే మానవ చర్యల వల్ల వాతావరణం, సముద్రాల్లో పేరుకుపోయిన అదనపు శక్తి కూడా ఇందుకు కారణమని పేర్కొంది. ఎల్ నినో బలహీనపడుతున్నప్పటికీ భారత్, పాకిస్థాన్ సహా దక్షిణాసియా దేశాల్లోని కోట్లాది మంది ఈ వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలను ఎదుర్కొన్నారు. ఈ ఏడాది జూన్-ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి, లా నినా ఏర్పడటానికి అవకాశాలు 50 శాతం చొప్పున ఉన్నాయని డబ్ల్యూఎంవో స్పష్టం చేసింది.
లా నినా ఏర్పడటానికి జులై-సెప్టెంబరు మధ్య 60 శాతం, ఆగస్టు-నవంబరు మధ్య 70 శాతం మేర అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది ఎల్ నినో వల్ల దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు తక్కువగా కురిసి, పొడి వాతావరణం ఉంటుంది. లా నినా మాత్రం దీనికి పూర్తి భిన్నం. నైరుతి సీజన్‌లో వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. ఇక, ఎల్ నినో ముగిసినప్పటికీ దీర్ఘకాల వాతావరణ మార్పులు కొనసాగుతాయని డబ్ల్యూఎంవో డిప్యూటీ సెక్రటరీ జనరల్ కో బ్యారెట్ అన్నారు. ‘గ్రీన్‌హౌస్ వాయువులు, కర్బన ఉద్గారాల కారణంగా భూమి వేడెక్కడం కొనసాగుతుంది.. గడిచిన 9 ఏళ్లు అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైన కాలంగా నిలిచిపోయింది’అని ఆయన గుర్తుచేశారు. 2020 నుంచి 2023 ప్రారంభం వరకూ లా నినా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు.