National

ఎనిమిదో వింతగా ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి- త్వరలోనే ట్రైన్​ పరుగులు! – Chenab Railway Bridge

Published

on

Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్‌ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై ఈ నిర్మాణం చేపట్టగా, అతి త్వరలోనే రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వంతెన ద్వారా రాంబన్‌ నుంచి రియాసికి రైలు సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది. ఫలితంగా జమ్మూకశ్మీర్‌ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది.

కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్‌ వంతెన నిర్మించారు. చీనాబ్‌ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 13వందల15 మీటర్లు. ఇందులో భాగంగా టెన్నెళ్లు కూడా నిర్మించారు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్‌ నదిపై ఉన్న 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వేవంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండడం విశేషం.

ప్రపంచంలో ఎనిమిదో వింత
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలో ఎనిమిదో వింతగా నిలువనుందని అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జి ఇంజినీర్ల ప్రతిభకు అద్దం పడుతోందని, వంతెన పనులను పరిశీలించిన తర్వాత రియాసి డిప్యూటీ కమిషనర్‌ విశేశ్‌ మహాజన్‌ పేర్కొన్నారు.

“మీరు టైటానిక్ సినిమా చూసే ఉంటారు. టైటానిక్ ఓడలో కూర్చున్నప్పుడు నేను ఈ ప్రపంచానికే రాజును అనే భావన కలుగుతుందని చెబుతుంటారు. అత్యంత ఎత్తైన ఈ వంతెనపై రైలులో వెళ్లేటప్పుడు కూడా అదే భావన కలుగుతుంది. ఆధునిక ప్రపంచంలో ఇది ఒక ఇంజినీరింగ్‌ అద్భుతం. ఈ ట్రాక్‌, టన్నెళ్లు ఒక అద్భుతం. రైలు నడిచిన రోజు రియాసీకి ఒక గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది. ప్రపంచంలో ఎనిమిదో వింత అవుతుందని అంతా చెబుతున్నారు. ఇలాంటి వంతెనపై వెళుతున్నప్పుడు ఇక్కడ గాలుల వేగం, దీని సామర్థ్యాన్ని చూస్తే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఇది మాకు ఎంతో గర్వకారణం. మాకు చాలా సంతోషం, అభివృద్ధిని తీసుకొస్తుందని విశ్వసిస్తున్నాను.” –విశేశ్‌ మహాజన్‌, రియాసి డిప్యూటీ కమిషనర్‌. ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తయి సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version