Hyderabad
Durgam Cheruvu Cable Bridge : కేబుల్ బ్రిడ్జి ప్రమాదాలపై పోలీసులు సీరియస్-సెల్ఫీలు దిగితే వెయ్యి ఫైన్, కేసు నమోదు
Durgam Cheruvu Cable Bridge : హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి(Hyderabad Cable Bridge)పై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు(Selfies), రీల్స్(Reels) కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం వెళ్లిన ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన ఓ కారు(Car Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. అనిల్, అజయ్ అనే యువకులు శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు. అక్కడ కాసేపు సరదాగా సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12.30 గంటలకు వేగంగా వచ్చిన ఇన్నోవా కారు సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ప్రమాదం చేసిన కారు ఆగకుండా వెళ్లిపోయింది. కారు ఢీకొనడంతో తీవ్రగాయాల పాలైన యువకులను పోలీసులు మాదాపూర్ పేస్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యో అనిల్ మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు హిట్ అండ్ రన్ కేసు(Hit and Run case) నమోదు చేశారు. ఇద్దరి యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
సెల్ఫీల కోసం కేబుల్ బ్రిడ్జిపైకి వస్తే జరిమానా
హిట్ అండ్ రన్(Hit and Run Case) లో మృతి చెందిన అనిల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రమాదం చేసిన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఆ కారు ఓనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి హిట్ అండ్ రన్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జి(Durgam Cheruvu Cable Bridge)పై సెల్ఫీల కోసం రోడ్ల మధ్యలోకి వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుతున్నాయని పోలీసులు అంటున్నారు. కేబుల్ బ్రిడ్జి వాహనాల కోసమని, సెల్ఫీల కోసం ఏర్పాటు చేసింది కాదని తెలిపారు. ఎవరైనా సెల్ఫీల(Selfies) కోసం రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జీపై సెల్ఫీలు దిగితే ఫైన్ తోపాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. సెల్ఫీలు దిగేందుకు దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీపై వెళ్లకూడదని మాదాపూర్ సీఐ మల్లేష్ తెలిపారు. ఎవరైనా ఫొటోల కోసం కేబుల్ బ్రిడ్జిపైకి వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.