Latest
శునకానికి అరుదైన హార్ట్ సర్జరీ- దిల్లీ వైద్యుల ఘనత- ఆసియాలో ఇదే మొదటిసారి – Dog Heart Surgery
Dog Heart Surgery In Delhi : ఓ శునకానికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు దిల్లీలోని పశువైద్య నిపుణులు. సంక్లిష్టమైన గుండె సమస్యను ఎదుర్కొంటున్న ఒక కుక్కకు కోతలేని గుండె సర్జరీ నిర్వహించారు. అయితే భారత ఉపఖండంలో ప్రైవేటు వైద్యులు ఇలాంటి సర్జరీని నిర్వహించడం ఇదే మొదటిసారి. ఏడేళ్ల వయసున్న జూలియట్ అనే శునకం రెండేళ్లుగా మైట్రల్ కవాటాల్లో సమస్యతో బాధపడుతోంది. ఈ భాగాల్లో వయసుతోపాటు వచ్చే క్షీణతల కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. శునకాల్లో వచ్చే గుండె సమస్యల్లో దీని వాటా 80శాతంగా ఉంది. దీంతో గుండె ఎడమ ఎగువ గదిలో రక్తప్రవాహం వెనక్కి వెళుతుంది. ఇక ఈ వ్యాధి ముదిరేకొద్దీ ఊపిరితిత్తుల్లో రక్తం, ద్రవాల పరిమాణం పెరిగుతుంది. ఇది క్రమంగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది.
ఈ సమస్యతో బాధపడుతున్న జూలియట్‌కు దిల్లీలోని మ్యాక్స్ పెట్జ్ ఆసుపత్రి నిపుణులు, ట్రాన్స్‌కెథతర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపెయిర్ (టీఈఈఆర్) అనే ప్రక్రియ ద్వారా సర్జరీ చేశారు నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండా రక్తనాళం గుండా ఒక సాధనాన్ని పంపి శస్త్రచికిత్స చేశారు. గుండె కొట్టుకుంటుండగానే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. గత నెల 30న ఈ శస్త్రచికిత్స జరిగింది. రెండు రోజుల అనంతరం ఆ శునకాన్ని డిశ్ఛార్జి చేశారు. ప్రస్తుతం శునకం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి శస్త్ర చికిత్స చేయడం ఆసియాలోనే మొదటది, ప్రపంచంలోనే రెండోది అని తెలిపారు.
తొలిసారి కోతికి కంటిశుక్లం సర్జరీ
Monkey Cataract Surgery In Haryana : మనుషుల లాగానే కోతికి క్యాటరాక్ట్(కంటి శుక్లం) శస్త్ర చికిత్స చేసి కంటి చూపు వచ్చేలా చేశారు హరియాణా పశు వైద్యులు. హిసార్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్(LUWAS) వారు ఈ సర్జరీ నిర్వహించారు. కోతికి ఈ తరహా చికిత్స చేయడం ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు.
హిసార్‌లోని ఓ కోతి కొద్ది రోజుల కిత్రం విద్యుత్ షాక్‌కు గురైంది. కాలిన గాయాలతో బాధపడుతున్న వానరాన్ని మునీశ్ కుమార్ అనే వ్యక్తి కాపాడి వెటర్నరీ విశ్వవిద్యాలయానికి తరలించాడు. వెటర్నరీ వైద్యులు కోతికి చికిత్స చేశారు. కొద్ది రోజులకు నడవగలిగింది. కానీ, ముందున్న వస్తువును గుర్తించలేకపోయింది. దీంతో మళ్లీ కోతిని పరిశీలించగా కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వానరానికి క్యాటరాక్ట్ సర్జరీ నిర్వహించారు. ఈ సర్జరీ సక్సెస్ కావడం వల్ల కోతికి కంటిచూపు వచ్చింది.