Hyderabad
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ న్యాయమూర్తి బదిలీ
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి నాగ్ పాల్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తిగా ఉన్న నాగ్ పాల్.. తీస్ హజారీ జిల్లా కోర్టుకు బదిలీ అయ్యారు. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల కస్టడీ విధించారు నాగ్ పాల్. నాగ్ పాల్ స్థానంలో కొత్త జడ్జిగా కావేరీ బవేజా నియమితులయ్యారు. కావేరీ బవేజా ఇక నుంచి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, ఇతర కేసులు విచారించనున్నారు.
58 మంది న్యాయాధికారులు బదిలీ..
ఢిల్లీ హైకోర్టు పరిధిలో 58మంది న్యాయాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. న్యాయాధికారుల బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. హయ్యర్ జుడీషియల్ సర్వీసెస్ కింద వివిధ జిల్లా కోర్టులు, ప్రత్యేక కోర్టుల్లో న్యాయాధికారులుగా పని చేస్తున్న 27 మందిని బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు వెలువరించింది ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ.
నాగపాల్ స్థానంలో కావేరీ బవేజా..
వీరిలో కీలకమైన మద్యం కేసు విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయాధికారి ఎంకే నాగపాల్ బదిలీ అయ్యారు. ఎంకే నాగపాల్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నుంచి తీస్ హజారీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ. వీరితో పాటు ఢిల్లీ జుడీషియల్ సర్వీసెస్‌లో పని చేస్తున్న 31మంది న్యాయాధికారులను కూడా బదిలీ చేసింది హైకోర్టు. ఎంకే నాగపాల్ స్థానంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా కావేరీ బవేజాను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.