Andhrapradesh

దర్శి టిడిపిలో రోజుకో ట్విస్ట్‌.. అభ్యర్ధి ఎంపికపై వీడని చిక్కుముడి..

Published

on

దర్శిలో టిడిపి అభ్యర్ధి ఎంపిక చిక్కుముడి ఇప్పట్లో వీడేలా కనిపించడంలేదు. ఒక ముడి విప్పేలోపే మరో చిక్కుముడి పడుతున్నట్టుగా తయారైంది పరిస్థితి. దర్శి నుంచి మాజీ మంత్రి, ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్న శిద్దా రాఘవరావు పేరును ఎంపిక చేసేందుకు టిడిపి అధిష్టానం పరిశీలిస్తోంది. దాదాపు శిద్దా రాఘవరావు పేరు ఖరారయ్యే చివరి నిమిషంలో సియం వైయస్‌ జగన్‌ నుంచి శిద్దాకు పిలుపువచ్చింది. పార్టీ మారే ఆలోచనలో ఉన్న శిద్దాను బుజ్జగించే పనిలో ఉంది వైసిపి అధిష్టానం. రానున్న ఎన్నికల్లో దర్శి వైసిపి టికెట్‌ ఆశించారు శిద్దా రాఘవరావు. అయితే అధిష్టానం పెద్దలు మాత్రం తొలుత అద్దంకి, ఆ తరువాత ఒంగోలు, అనంతరం మార్కాపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని శిద్దాకు సూచించినట్లు తెలుస్తోంది.

శిద్దా మాత్రం తాను దర్శి నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో ఆయనకు వైసిపి టికెట్‌ లభించలేదు. ఈ నేపధ్యంలో టిడిపిలో చేరి ప్రస్తుతానికి ఖాళీగాఉన్న దర్శి టిడిపి స్థానం నుంచి పోటీ చేయాలన్న ఒత్తిడి టిడిపి నుంచి ఎదురైంది. దర్శి నుంచి టిడిపి టికెట్‌పై పోటీ చేసేందుకు శిద్దా సమాయాత్తమయ్యేలోపే వైసిపి అధిష్టానం నుంచి శిద్దాకు పిలుపువచ్చిందట. సియం వైయస్‌ జగన్‌ను కలవాలని వైసిపి అధిష్టానం పెద్దలు శిద్దాకు సూచించినట్లు సమాచారం. దీంతో దర్శిలో టిడిపి టికెట్‌పై శిద్దా పోటీ చేసే విషయంలో సిందిగ్దత నెలకొంది. సియంతో తాజాగా భేటీ అనంతరం ఆయన ఏం మాట్లాడారో, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది శిద్దా చెబితేకానీ తెలియని పరిస్థితి నెలకొంది. మరో రెండు రోజుల్లో శిద్దా రాఘవరావు టిడిపిలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారనుకుంటున్న తరుణంలో వైసిపి అధిష్టానం నుంచి పిలుపురావడంతో ఇక శిద్దా దర్శిలో టిడిపి నుంచి పోటీ చేయడం ఆనుమానమే అంటున్నారు.

టిడిపి నుంచి నిన్నటి వరకు రేసులో మాజీ మంత్రి శిద్దా..
దర్శి నియోజకవర్గంలో కమ్మ, యాదవ, కాపు సామాజికవర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2014లో టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్దిగా పోటీ చేసిన శిద్దా రాఘవరావుకు జనసేన మద్దతు లభించడంతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా లభించాయి. దీంతో ఇక్కడ టిడిపి గెలుపుసాధ్యమైంది. ప్రస్తుతం కూడా ఇదే కాంబినేషన్‌లో బిజెపి, టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా జనసేన పార్టీ తమ అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలని నిన్నటివరకు కోరింది. అయితే తాజాగా పొత్తుల్లో భాగంగా జనసేన దర్శి సీటును వదులుకోవాల్సి రావడంతో ఇక్కడ టిడిపి నేతలు పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఇక్కడ టికెట్‌ కోసం టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ప్రధమంగా ప్రస్తుతం వైసిపి పార్టీలో ఉన్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పేరు ప్రముఖంగా వినిపించింది. శిద్దా రాఘవరావు 2014 ఎన్నికల్లో దర్శి నుంచి టిడిపి టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు.

చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టి దర్శిలో ఎన్నడూ లేని విధంగా 3 వేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా శిద్దా రాఘవరావును టిడిపి అధిష్టానం ఒంగోలు పార్లమెంట్‌కు ఎంపి అభ్యర్దిగా పోటీ చేయించింది. ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన శిద్దా రాఘవరావు ఆ తరువాత అధికారపార్టీ వైసిపిలో చేరారు. 2024 ఎన్నికల్లో వైసిపి నుంచి దర్శి టికెట్‌పై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా తిరిగి టిడిపి టికెట్‌పై దర్శి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అందుకు ప్రస్తుతం టిడిపి ఎంపి అభ్యర్ధిగా పోటీ చేయనున్న మాగుంట రాఘవరెడ్డి కుటుంబం నుంచి కూడా దర్శి నుంచి శిద్దా అయితే బాగుంటుందని టిడిపి అధిష్టానానికి సూచించినట్టు వినికిడి. ఈ నేపథ్యంలో శిద్దా రాఘవరావు కూడా టిడిపిలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా సీఎం జగన్ ను కలవడంతో పరిస్థితులు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version