International

కోవిడ్-19 టీకా సృష్టికర్తపై వేటు.. పార్లమెంటు నుంచి బహిష్కరించిన చైనా

Published

on

కోవిడ్-19 మొదటి టీకా అభివృద్ధికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్తపై చైనా చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘన, అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శాస్త్రవేత్త యాంగ్ షావోమింగ్‌పై బహిష్కరణ వేటు వేసింది. ఆయన సభ్యత్వాన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) రద్దుచేసింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లో అవినీతి తారాస్థాయికి చేరుకుంది. క్రమశిక్షణ, చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న కేసులు అధికమయ్యాయి. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంగ్ షావోమింగ్ (62)ను పార్లమెంటు నుంచి ప్రభుత్వం బహిష్కరించింది.

చైనాలోని ముఖ్యమైన శాస్త్రవేత్తల్లో ఒకరైన యాంగ్… చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్‌బీజీ) అనుబంధ విభాగం చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్‌కి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న సమయంలో దేశీయ మొదటి కొవిడ్ టీకా సినోఫార్మ్‌కు చెందిన బీబీఐబీపీ-కోర్ వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. సాధారణ వినియోగానికి చైనా అనుమతించిన తొలి కరోనా టీకా ఇదే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంగ్‌పై ఇప్పటికే సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్‌పెక్షన్ (సీసీడీఐ) దర్యాప్తు చేపట్టింది.

సినోఫార్మ్ టీకా, సినోవాక్ బయోటెక్ కరోనావాక్‌లను చైనాలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఆ దేశం ఎగుమతి చేసే కోవిడ్-19 వ్యాక్సిన్‌లు కూడా ఇవే. సినోఫార్మ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఒకప్పుడు కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జౌ బిన్‌పై ఆరోపణలు రావడంతో జనవరిలో CCDI విచారణకు అనుమతించారు. ఇక, యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేసిన కరోనా మహమ్మారి తొలుత చైనాలోనే వెలుగుచూసిన విషయం తెలిసిందే. వుహాన్ నగరంలోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌ నుంచి ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. అయితే, దీనిని ల్యాబ్‌లోనే తయారుచేసినట్టు అమెరికా సహా పలు దేశాలు ఆరోపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు చేపట్టింది. కానీ, ఈ దర్యాప్తునకు తొలినాళ్లలో సహకరించడానికి చైనా నిరాకరించింది. తర్వాత సమ్మతించినా.. పూర్తిస్థాయి సమాచారం మాత్రం అందజేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version