International

‘ఇరాన్​పై ప్రతిదాడి అనవసరం, మాట వినకుంటే సాయం చేయం’- ఇజ్రాయెల్​కు అమెరికా స్పష్టం – Us On Iran Israel War

Published

on

US On Iran Israel War : ఇరాన్‌పై ప్రతిదాడులు చేయొద్దని ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా తిప్పికొట్టిన తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఫోన్లో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్‌పై దాడి చేయవద్దని సూచించిన బైడెన్‌, మాట వినకుండా ఆ పని చేస్తే అమెరికా ఎలాంటి సహకారం అందించబోదని స్పష్టం చేశారు. మెజారిటీ డ్రోన్లు, క్షిపణులను కూల్చడమే ఇజ్రాయెల్‌కు అతిపెద్ద విజయమని వివరించారు. టెల్‌ అవీవ్‌కు నష్టం జరగనందున ప్రతిదాడులు అనవసరమని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఐరాస భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇరాన్‌ చేసిన అసాధారణ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సమావేశంలో అమెరికా, బ్రిటన్‌ ముక్తకంఠంతో ప్రకటించాయి. ఈ దాడి దారుణమైందన్న బ్రిటన్‌ రాయబారి మధ్యప్రాచ్య పౌరభద్రత స్థిరత్వాలకు ఇది ప్రమాదం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ చర్యలు ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఇజ్రాయెల్‌ రాయబారి గిలాడ్ ఎర్డాన్ మండలిలో పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం కోసం ఇరాన్‌ తపిస్తోందన్నారు. ఉగ్రవాదానికి నంబర్ వన్ గ్లోబల్ స్పాన్సర్‌ ఐన ఇరాన్‌పై వీలైనన్ని ఆంక్షలు విధించాలని కోరారు. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ చట్టపరమైన అన్ని హక్కులను కలిగి ఉందన్నారు.

ఈ దాడులపై ఐరాస భద్రతా మండలిలో ఇరాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరావాని వివరణ ఇచ్చారు. ముందు సిరియాలోని తమ కాన్సులేట్‌ భవనంపై దాడి జరిగిందన్న ఆయన, ఆత్మరక్షణ హక్కులో భాగంగా ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్ 51 నిబంధన ప్రకారం దాడులు నిర్వహించినట్లు ప్రకటించారు. పౌరులకు ఏ నష్టం జరగకుండా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ ఉగ్రదాడి చేసినప్పుడు ఏ దేశం ఖండించలేదన్నారు. ఆ సమయంలో అంతర్జాతీయ శాంతిభద్రతను కాపాడటంలో భద్రతా మండలి విఫలమైందన్నారు. తర్వాత ప్రసంగించిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌, మిడిల్‌ ఈస్ట్‌ ప్రజలు ఇప్పటికే వినాశకరమైన, తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇరాన్‌పై ప్రతీకార చర్యలకు దిగి ఉద్రిక్తతలను మరింత పెంచవద్దని సభ్యదేశాలకు విజ్ఞప్తి చేశారు. అక్కడ మరిన్ని యుద్ధాలు జరిగితే పశ్చిమాసియాతోపాటు ప్రపంచం కూడా వాటిని భరించలేదని హితవు పలికారు.

ఏప్రిల్‌ ఒకటో తేదీన సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి నిర్వహించింది. ఆ దాడిలో టాప్‌ కమాండర్‌ సహా ఏడుగురు ఇరాన్‌ సైనికులు మరణించారు. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్‌, ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని చెబుతూ వచ్చింది. తాము చేపట్టబోయే చర్యలకు అమెరికా దూరంగా ఉండాలని హెచ్చరించింది. అన్నట్లుగానే 13వ తేదీన రాత్రి వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్‌వైపు ప్రయోగించింది. అందులో 99 శాతం వాటిని అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌ కలిసి ఆకాశంలోనే ధ్వంసం చేశాయి.

Read also:
ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడి- వందలాది డ్రోన్లు, క్షిపణులతో అటాక్- మళ్లీ అలా చేయొద్దని వార్నింగ్ – Iran Attacks Israelhttps://infoline.one/iran-against-israel/

Advertisement

‘ఇరాన్​పై ప్రతీకారం తీర్చుకుంటాం, ‘ఆపరేషన్​ ఐరన్​ షీల్డ్​’ అనివార్యం’- ఇజ్రాయెల్ ప్రకటన – Iran Israel War https://infoline.one/revenge-on-iran-tir/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version