International

‘మా దేశంపై చైనా సైనిక చర్యలను ఆపాలి’- తైవాన్ అధ్యక్షుడిగా లాయ్‌ చింగ్‌ తె ప్రమాణం – Taiwan New President Inauguration

Published

on

Taiwan New President China : చైనాతో తాము శాంతిని కోరుకుంటున్నామని తైవాన్ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తె (Lai Ching-te) తెలిపారు. తమ దేశంపై సైనిక చర్యలను చైనా ఆపేయాలని కోరారు. చైనాతో తైవాన్ మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లాయ్‌ చింగ్‌ తె(64) బాధ్యతలు చేపట్టాక చేసిన తొలి ప్రసంగంలో చైనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అలాగే సైనికులు కవాతు చేశారు. తైవాన్ జెండాతో సైనికులు హెలికాఫ్టర్లపై విన్యాసాలు చేశారు.

” చైనాతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం. కానీ తైవాన్​పై డ్రాగన్ బెదిరింపులు, చొరబాట్లకు యత్నిస్తోంది. మా దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తైవాన్ సామాజిక భద్రతా వలయాన్ని బలపరుస్తాం. కృత్రిమ మేధస్సు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో తైవాన్​ను మరింత ముందుకు తీసుకెళ్తా.” అని తైవాన్ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తె వ్యాఖ్యానించారు.

కొవిడ్ మహమ్మారి, చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు వేళ తైవాన్​ను ఎనిమిదేళ్లపాటు ఆర్థిక, సామాజిక అభివృద్ధి పథంలో నడిపించిన సాయ్ ఇంగ్-వెన్ నుంచి లయ్ చింగ్ తే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. తైవాన్‌ను చైనా తిరుగుబాటు ప్రావిన్స్‌గా భావిస్తోంది. పలుమార్లు తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు సైతం చేపట్టింది. అవసరమైతే బలవంతంగా తైవాన్​ను తమ దేశంలో కలుపుకునేందుకు డ్రాగన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తైవాన్ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తె.

ప్రపంచ దేశాధినేతల అభినందనలు
తైవాన్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లయ్ చింగ్ తేకు పలు దేశాలు అభినందనలు తెలిపాయి. అమెరికా నుంచి సైనిక పరికరాల దిగుమతులు చేసుకుంటామని లయ్ చింగ్ తే పేర్కొన్నారు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ వంటి మిత్రదేశాలతో ప్రాంతీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు.

లాయ్‌ చింగ్‌ తె రాజకీయ ప్రస్థానం
టైవాన్ మేయర్‌గా రాజకీయాల్లోకి ప్రవేశించారు లాయ్‌ చింగ్‌ తె. ఆ తర్వాత ఆయన తైవాన్ ఉపాధ్యక్షుడిగానూ పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ) గెలుపొందింది. డీపీపీ తరఫున బరిలోకి దిగిన లాయ్‌ చింగ్‌ తె విజయం సాధించారు. ఈ క్రమంలో మే 20(సోమవారం) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

అమెరికాపై చైనా ఆంక్షలు
మరోవైపు తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లాయ్‌ చింగ్‌ తె బాధ్యతలు చేపట్టిన వేళ చైనా కీలక నిర్ణయం తీసుకుంది. తైవాన్​కు ఆయుధాల విక్రయిస్తున్న అమెరికాకు చెందిన బోయింగ్, మరో రెండు రక్షణ సంస్థలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆంక్షలను విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version