International
చైనా కవ్వింపు చర్యలు – తైవాన్ చుట్టూ డ్రాగన్ సైనిక విన్యాసాలు – China Military Drills
China Military Drills : తైవాన్ స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ ఆ దేశ నూతన అధ్యక్షుడు చేసిన ప్రసంగంపై మండిపడుతున్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తమ కండబలాన్ని ప్రదర్శిస్తోంది. తైవాన్‌ను చుట్టుముట్టి వైమానికదళం, నావికాదళం, పదాతిదళంతో సంయుక్త విన్యాసాలు చేపట్టింది. వేర్పాటువాద శక్తులకు తమ కసరత్తులు శిక్ష అని ప్రకటించింది. చైనా సైనిక విన్యాసాలతో అప్రమత్తమైన తైవాన్, డ్రాగన్ వైఖరి ప్రాంతీయంగా శాంతికి విఘాతమని తెలిపింది. ఆధిపత్య ధోరణి సరికాదని సూచించింది.
హెచ్చరికగా సైనిన విన్యాసాలు
చైనా సైన్యానికి చెందిన తూర్పు థియేటర్ కమాండ్ నేతృత్వంలో రెండు రోజలు పాటు సైనిక విన్యాసాలు చేపట్టింది. తైవాన్ జలసంధి, తైవాన్ ద్వీపానికి ఉత్తర, దక్షిణ, తూర్పుభాగాలతో పాటు కిన్మెన్, మాట్సు, డోంగిన్ ద్వీపాల చుట్టూ చైనా సైనిక కసరత్తులు చేపట్టింది. ‘జాయింట్ స్వార్డ్-2024ఏ’ అనే కోడ్ పేరుతో సైన్యం, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా కసరత్తు చేస్తున్నట్లు చైనా సైనిక ప్రతినిధి లీ జి వివరించారు. ఉమ్మడి పోరాట సంసిద్ధతను మెరుగుపరుచుకోవడం, నియంత్రణను కోసం సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ రెండు రోజుల సైనిక విన్యాసాలు వేర్పాటువాద శక్తులకు శక్తిమంతమైన శిక్ష అని చైనా సామాజిక మాధ్యమం వీబోలో పోస్ట్ చేశారు. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్న బాహ్యశక్తులకు హెచ్చరిక అని పేర్కొన్నారు.
తైవాన్‌ను భయపట్టేందుకు ప్రయత్నం
తైవాన్ తమదేనంటూ చైనా చేస్తున్న వాదనను తోసిపుచ్చుతూ తైవాన్ కొత్త అధ్యక్షుడు లాయ్ చింగ్ తే చేసిన ప్రసంగం డ్రాగన్ సర్కార్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తైవాన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన లాయ్ చింగ్ తె, చైనా తన సైనిక బెదిరింపులు మానుకోవాలని సూచించారు. తైవాన్‌ను యధావిధిగా కొనసాగించేందుకు చైనా నాయకత్వంతో చర్చలు కొనసాగించాలనేది తమ అభిమతమని చెప్పారు. తద్వారా ఘర్షణలను నివారించవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో సైనిక విన్యాసాలకు చైనా తెరతీసింది. తద్వారా తైవాన్‌ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
అప్రమత్తమైన తైవాన్
చైనా దుందుడుకు వైఖరి నేపథ్యంలో తైవాన్ తమ యుద్ధ విమానాలు, క్షిపణులు, నావికాదళం, సైనిక పదాతిదళ యూనిట్లను అప్రమత్తం చేసింది. చైనా అసంబద్ధ కవ్వింపు చర్యలు ప్రాంతీయంగా శాంతిని, సుస్థిరతను దెబ్బతీస్తాయని తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. తైవాన్ ఎలాంటి ఘర్షణను కోరుకోవడంలేదని, అవసరమైతే ఆ విషయంలో పారిపోబోమని పేర్కొంది. చైనా తీరు ఆధిపత్య ధోరణికి నిదర్శనమని విమర్శించింది.