Andhrapradesh
Chandrababu Naidu : ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారపర్వంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే..
TDP Prajagalam : ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు, సభలు, సమావేశాల ద్వారా టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో.. ఐదు రోజుల్లో 17 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ మేరకు 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు టీడీపీ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసింది. ఇవాళ పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఐదు రోజుల షెడ్యూల్ ఇలా..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
27న (బుధవారం) పలమనేరు, నగరి, మదనపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం సాగనుంది.
28న (గురువారం) రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో..
29న (శుక్రవారం) శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూల్ నియోజకవర్గాల్లో..
30న (శనివారం) మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో..
31న (ఆదివారం) కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం సాగనుంది.
నేటి షెడ్యూల్ ఇదే..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో చేపట్టనున్న ఎన్నికల ప్రచారం ఇవాళ ప్రారంభం కానుంది. కుప్పం నుంచి హెలికాప్టర్ లో ఉదయం 10.50 గంటలకు చంద్రబాబు పలమనేరు చేరుకుంటారు. ఉదయం 11గంటలకు పలమనేరు నుంచి చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. పలమనేరులో టీడీపీ శ్రేణులతో సమావేశం అవుతారు. 2.30 గంటల నుంచి 4గంటల వరకు నగరి నియోజకవర్గం పరిధిలోని పుత్తూరులో జరిగే ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మదనపల్లెలో జరిగే ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి మదనపల్లెలోనే బస చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఏర్పాట్లు చేశారు.